తమ్ముళ్లకు ఇసుకాసులు
పొట్టేపాళెం రీచ్‌లో జేసీబీలతో తవ్వకాలు
నెల్లూరు సిటీ: ఇసుక ఉచితమని ప్రభుత్వం ఊదరగొట్టినా, క్షేత్రస్థాయిలో అదంతా వట్టిదేనని తేలిపోతోంది. క్షేత్రస్థాయిలో ఇసుకాసురులు చెలరేగిపోతూ నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో తవ్వకాలు సాగిస్తూ ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాళెం అరుంధతీయపాళేనికి సమీపంలోని పల్లెపాళెం వద్ద గత కొన్ని వారాలుగా జేసీబీలతో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ కరకట్టను తొలగించి తమ పనిని కొనసాగిస్తున్నారు.
ఆ ఇద్దరి కనుసన్నల్లోనే..
టీడీపీ రూరల్ నియోజకవర్గ ముఖ్యనేతకు అనుచరులైన కాంట్రాక్టర్లు అచ్యుత్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో వ్యవహారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఇద్దరూ పొట్టేపాళెంపై దృష్టి సారించారు. గతంలో రాత్రి వేళే తంతు సాగిస్తుండగా, ప్రస్తుతం పగలూ నిరాటంకంగా సాగుతోంది.
దారుల ఏర్పాటు
పొట్టేపాళెం వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన రీచ్ నుంచి నిత్యం 20 ట్రాక్టర్లలో 250కుపైగా ట్రిప్పులను తరలిస్తున్నారు. నెల్లూరు – పొట్టేపాళెం ప్రధాన రోడ్డు నుంచి అంజనీ వనం లేఅవుట్ మీదుగా దారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి అరుంధతీయవాడలోని ఓ చిన్న వీధి మీదుగా ఇవి వేగంగా వెళ్తున్నాయి.
బయటవారు రాకుండా నిఘా
ఇసుక తవ్వకాలు సాగించే ప్రాంతానికి మైనింగ్, రెవెన్యూ అధికారులు, మీడియా ప్రతినిధులు రాకుండా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. అరుంధతీయవాడ వద్ద పల్లెపాళెం కరకట్టను తొలగించి, ఆ ప్రాంతానికి బైక్‌లు, కార్లు రాకుండా ఇసుకను అడ్డంగా వేశారు. ట్రాక్టర్లు మాత్రమే తిరిగేలా, ఇతర వాహనాలు వస్తే ఇరుక్కుపోయేలా ఏర్పాట్లు చేశారు. రీచ్ రహదారి వెంబడి నిఘా నిమిత్తం నలుగుర్ని ఏర్పాటు చేశారు. ఎవరు లోపలికొచ్చినా ఫోన్ల ద్వారా సమాచారం చేరవేసేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించడంలేదు.
సమీపంలోని పల్లెపాళెం వద్ద
కరకట్టను ధ్వంసం చేసి..
అడ్డదారిలో తరలింపు
రోజూ 20 ట్రాక్టర్లలో
250 ట్రిప్పులకుపైగా రవాణా
అధికారులు, మీడియా ప్రతినిధుల రాకపోకలపై నిఘా
తమ్ముళ్లకు ఇసుకాసులు


