ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి 21న పరీక్ష
నెల్లూరు (టౌన్): రానున్న విద్యాసంవత్సరంలో ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఈ నెల 21న నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 20న నిర్వహించాలని తొలుత నిర్ణయించినా, ఈస్టర్ కావడంతో దాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారన్నారు. హాల్‌టికెట్లను cse. ap. gov. in లేదాలేదా apms. apcfss. in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.
ఇంటర్‌లో సంస్కరణలపై అవగాహన కల్పించాలి
నెల్లూరు (టౌన్): రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంటర్‌లో చేపట్టిన సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రిన్సిపల్స్‌తో సమావేశాన్ని నగరంలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల షెడ్యూల్, అకడమిక్ క్యాలెండర్, సిలబస్ మార్పు, కొత్త సబ్జెక్టుల కాంబినేషన్, మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రాల డిజైన్ మార్పు, పని గంటల పెంపు తదితరాలను తెలియజేశారు. డీవీఈఓ మధుబాబు, సమగ్రశిక్ష ఏఎంఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
డీటీసీ డీఎస్పీ బదిలీ
నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులను డీజీపీ గురువారం జారీ చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు డీటీసీ డీఎస్పీ గిరిధర్‌రావును ఏసీబీకి బదిలీ చేశారు. విధుల నుంచి రిలీవై బదిలీ అయిన ప్రాంతంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎస్పీ కృష్ణకాంత్‌కు అస్వస్థత
నెల్లూరు(క్రైమ్): ఎస్పీ కృష్ణకాంత్ అస్వస్థతకు గురై నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్యాంప్ కార్యాలయంలో విధులను గురువారం నిర్వర్తిస్తుండగా, సొమ్మసిల్లారు. గమనించిన కుటుంబసభ్యులు, పోలీస్ అధికారులు ఆయన్ను హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. వివిధ పరీక్షలను వైద్యులు నిర్వహించారు. వేసవి తీవ్రతతో డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురయ్యారని, ప్రమాదమేమీలేదని తెలిపారు. కాగా ఎస్పీ ఆరోగ్య పరిస్థితిపై హోంమంత్రి అనిత ఆరాతీశారని సమాచారం. పలువురు పోలీస్ అధికారులు పరామర్శించారు.
ఘనంగా భగవాన్
మహావీర్ జయంతి
నెల్లూరు(బృందావనం) : నగరంలో భగవాన్ మహావీర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీజైన్ శ్వేతాంబర్‌మూర్తి పూజక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జైన మత గురువులు పన్యాస్ సమర్పణప్రభ, మునిరాజ్ ధ్యానప్రభ, దేవోదయప్రభ కార్యక్రమాన్ని జరిపించారు. తొలుత మండపాలవీధిలోని శ్రేయాన్ష్‌నాథ్ ఆలయంలో భగవాన్ మహావీర్ విగ్రహానికి అభిషేకం చేశారు. మండపాల వీధిలో ఉన్న జైన దేవాలయం నుంచి నగరోత్సవం ప్రారంభమై చిన్నబజార్, పెద్దబజార్, ఆచారివీధి, కాపువీధి మీదుగా మండపాలవీధికి చేరుకుంది. కిశోర్‌కుమార్ లుంకడ్ తన సంగీత స్వరంతో అలరించారు.
చిరుత సంచారం..?
దుత్తలూరు: మండలంలోని కొత్తపేట సమీపంలో చిరుత సంచారాన్ని ఓ వ్యక్తి గుర్తించారు. వివరాలు.. గ్రామానికి చెందిన నరసింహరావు కొత్తపేట సమీపంలోని వాగు వద్దకు బహిర్భూమికి వెళ్లారు. అక్కడ చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీసి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేశారు. దీనిపై జిల్లా అటవీ అధికారి మహబూబ్‌బాషాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉదయగిరి రేంజ్ అధికారి కుమార్‌రాజాను వెళ్లి పరిశీలించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ తరుణంలో డీఆర్వో మురళి, ఎఫ్బీఓ ప్రసాద్, అటవీ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని వాగు ప్రాంతంలో పాదముద్రల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఆనవాళ్లు కనిపించలేదు. గడ్డి బాగా పెరిగి ఉండటంతో పాదముద్రలు కనిపించలేదని, గ్రామస్తులు చెప్పే ఆనవాళ్ల బట్టి అడవిపిల్లిగా అనుమానిస్తున్నట్లు అటవీ అధికారులు చెప్పారు.
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి 21న పరీక్ష


