మందులతో నియంత్రణ
నెల్లూరు(అర్బన్): కొంతమంది చేతులు, లేదా మెడ నిరంతరం వణుకుతూ ఉంటాయి. మరికొందరికి తల ఊగిసలాడుతుంది. పలువురు కనీసం గ్లాసును గట్టిగా పట్టుకోలేక మంచినీరు తాగలేక ఇబ్బందులు పడుతుంటారు. వణుకుతూ భోజనం తినాల్సిందే. సమాజంలో ఇలాంటి వారు అరుదుగా కనిపిస్తారు. పార్కిన్సన్స్ (వణుకుడు రోగం) అనే జబ్బు వల్ల ఇలా జరుగుతుంది. ఇది ఒకసారి వస్తే జీవితాంతం బాధపడాల్సిందే.
అందువల్లే..
మెదడులో సబ్‌స్టాంటియా నిగ్రా అనే భాగంలో నాడీ కణాలు కోల్పోవడం వల్ల పార్కిన్సన్స్ అనే వణుకుడు జబ్బు వస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన న్యూరో డీజెనరేటివ్ వ్యాధి ఇది. సోకిన ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడతారు. ఈ జబ్బున్న వారు తమ శరీరమంతా అలసిపోయినట్టు భావిస్తారు. చేతులు, కాళ్లు వణుకుతుంటాయి. తల తిరగడం, బ్యాలెన్స్ తప్పిపోవడం, నిద్రలేమి, మతిమరుపు, కన్‌ఫ్యూజన్, వాసన అనే లక్షణం కోల్పోవడం జరుగుతుంది. కొంతమందికి మలబద్ధకం ఉంటుంది. మరికొందరు మానసికంగా కుంగుబాటుకు లోనవుతారు. నిధానంగా నడుస్తుంటారు. మాట కూడా నిధానమవుతుంది. అప్పుడప్పుడు బిగుసుకు పోతుంటారు. ఒక్కోదఫా పట్టుతప్పి (బ్యాలెన్స్ కోల్పోయి) పడిపోతుంటారు. తినేందుకు, మంచినీరు తాగేందుకు సైతం ఇబ్బంది పడాల్సిందే.
జిల్లాలో ఇలా..
జిల్లాలో పాత, కొత్త కేసులు కలిపి సుమారు 5 వేల మందికి పైగా రోగులన్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనా వేసింది. సంవత్సరంలో ప్రతి లక్ష మందిలో సుమారు 40 మంది వరకు ఈ వ్యాధికి గురవుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కోసారి ఈ జబ్బుకు గురైతే జీవితాంతం వెంటాడుతుంది. బీపీ, షుగర్ వచ్చిన వారిలా నిత్యం మందులు వాడాల్సిందే.
జిల్లాలో పెరుగుతున్న పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు
ఏటా కొత్త కేసుల నమోదు
క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే..
లేకుంటే ముప్పు
నేడు ప్రపంచ పార్కిన్సన్స్ (వణుకుడు రోగం) నివారణ దినోత్సవం
పార్కిన్సన్స్‌కు గురయ్యే వారికి పూర్తిస్థాయి చికిత్స లేదు. అయితే మందులతో జబ్బును నియంత్రించవచ్చు. అవసరమైన వారికి డీ బ్రెయిన్ స్టిములేషన్ అనే చిన్న ప్రొసీజర్ (సర్జరీ లాంటిది) చేస్తారు. దీంతో జబ్బు నియంత్రణలోకి వస్తుంది. అందువల్ల జబ్బున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి.
డాక్టర్‌ను సంప్రదించాలి
ప్రధానంగా చేతులు, మెడ వణుకుతున్న లక్షణాలు ఒకటి, రెండుసార్లు కనిపించినప్పుడు న్యూరాలజీ డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి. పరీక్షలు చేసి పార్కిన్సన్స్ అనే జబ్బు అవునో.. కాదో నిర్ణయిస్తారు. ఒకవేళ ఉంటే ప్రాథమిక దశలోనే చికిత్స చేయడం వల్ల ఆ జబ్బు ముదరకుండా పూర్థి స్థాయి నియంత్రణలో ఉంచవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర సమతుల్యతను కాపాడుకునేందుకు వీలవుతుంది. మాత్రలు వాడటం ద్వారా మిగిలిన వారిలా సాధారణ జీవితం గడపొచ్చు.
– డాక్టర్ ఫణికుమార్, న్యూరో ఫిజీషియన్,
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు
మంచి ఆహార అలవాట్లు తప్పనిసరి
వ్యాధి రాకుండా ఉండేందుకు మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం, బ్రెయిన్‌కు ఒత్తిడి లేకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా బ్యాలెన్స్‌డ్ ఆహారం వల్ల జబ్బు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు.
– డాక్టర్ దీక్షాంతి నారాయణ్,
మెడికవర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నెల్లూరు
మందులతో నియంత్రణ
మందులతో నియంత్రణ
మందులతో నియంత్రణ


