కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చిన్నారికి తీవ్రగాయాలు
అల్లూరు: విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఓ బాలిక తీవ్రగాయాలు పాలైన ఘటన ఉద్దీపగుంట కొత్తకాలనీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కోనేటి హరికృష్ణ, హనీతల కుమార్తె హవిలా 3వ తరగతి చదువుతోంది. ఇటీవల కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్ రోడ్డుపైనే నిర్లక్ష్యంగా వదిలి వెళ్లారు. గురువారం స్తంభాల వద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు హవిలా స్తంభాల మధ్యలో పడిపోయి కాళ్లు ఇరుక్కుపోయాయి. ఒక కాలు విరిగి పోగా మరొక కాలు నరాలు తెగిపోయాయి. నెల్లూరులోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.లక్షకు పైగా ఖర్చయింది. కూలీ చేసుకుంటే కానీ పూట గడవని ఆ కుటుంబానికి చిన్నారి వైద్యం భారంగా మారింది. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా వారిని ఎవరూ పట్టించుకోలేదు.


