గ్రావెల్ టిప్పర్లు పట్టుకున్నారు.. వదిలేశారు
పొదలకూరు : మండలంలోని మరుపూరు పొలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సోమవారం రాత్రి తహసీల్దార్ బి.శివకృష్ణయ్య సీజ్ చేశారు. వాటిపై ఎలాంటి చర్యలు లేకుండా కొద్ది సేపటికే వదిలేశారు. కొంతకాలంగా ప్రైవేట్ భూముల్లో గ్రావెల్‌ను తవ్వి నెల్లూరు నగరంలోని లేఅవుట్లు, ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. సుమారు నెల రోజులుగా మరుపూరు నుంచి నెల్లూరు నగరం చుట్టు పక్కల ప్రాంతాలకు అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల సమాచారం మేరకు తహసీల్దార్ తన సిబ్బందితో కలిసి గ్రావెల్ తరలిస్తున్న మొత్తం నాలుగు టిప్పర్లను సీజ్ చేశారు. వాటిలో మూడింటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించి మరొక టిప్పర్ రిపేరు ఉండడంతో అక్కడే సీజ్ చేసి ఉంచారు. అయితే ఏం జరిగిందో తెలియదు. సీజ్ చేసిన టిప్పర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విడుదల చేయడంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ అధికారులకు సైతం ఎలాంటి సమాచారం అందించలేదని తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్లో అప్పగించిన టిప్పర్లను మంగళవారం విడుదల చేశారు. మరుపూరు ప్రైవేట్ భూముల్లో గ్రావెల్ తవ్వి తరలిస్తున్న వారికి మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ విషయమై తహసీల్దార్ శివకృష్ణయ్య మాట్లాడుతూ సీజ్ చేసిన టిప్పర్ల విషయాన్ని దాటవేస్తూ.. అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటామని, టిప్పర్లను సీజ్ చేశామని మైనింగ్‌కు సమాచారం అందిస్తామన్నారు.


