
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
బిట్రగుంట: బోగోలు మండలం తాళ్లూరుకు చెందిన రైతు ఏసుపోగు మొలకయ్య (47) ఆర్థిక ఇబ్బందులతో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లూరులో తనకున్న రెండు ఎకరాల భూమిలో మెట్ట పంటలు సాగు చేస్తూ జీవనం సాగించే మొలకయ్య ఇటీవలే తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పిల్లల పెళ్లిళ్లకు చేసిన అప్పులతోపాటు నీటి వసతి లేని పొలంలో బోరు వేయించేందుకు ఇటీవల తెలిసిన వారి వద్ద కొంత అప్పు చేశాడు. బోర్లలో నీళ్లు పడకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తొలుత నెల్లూరుకు, అనంతరం చైన్నెకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. 44వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నగరంలోని డీఎస్‌ఆర్ ఇన్‌లో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.రామకృష్ణ, కార్యదర్శిగా కె.శ్రీనివాసులురెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఎం.మస్తానయ్య, కోశాధికారిగా ఎం హజిత్ యాదవ్, కౌన్సిలర్‌గా అనిల్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు క్రికెట్ సంఘం ఎన్నికల అధికారి బి.వెంకటస్వామి ప్రకటించారు. జిల్లా క్రికెట్ సంఘ గేమ్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్‌గా పి.భానుప్రకాష్‌రెడ్డిని 31 మంది క్రికెట్ సభ్యులు ప్రత్యేకంగా ఎన్నుకొన్నారు. ఈ సమావేశాన్ని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కేర్ టేకర్ డి.శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.
బీచ్ కబడ్డీ జిల్లా
పురుషుల జట్టు ఎంపిక
చినగంజాం: ఉమ్మడి ప్రకాశం జిల్లా బీచ్ కబడ్డీ పురుషుల జట్టు ఎంపిక ఆదివారం స్థానిక ఎంఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగింది. మే 2వ తేదీ నుంచి కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొననున్నట్లు అంతర్జాతీయ క్రీడాకారుడు, కోచ్ ఎం.గిరిబాబు తెలిపారు. పోటీల్లో పాల్గొనే జట్టుల ప్రయాణ, ఇతర ఖర్చుల మొత్తాన్ని చంద్రశేఖర్‌రెడ్డి అందజేశారు. చినగంజాంలో గత 15 ఏళ్లుగా స్వచ్ఛందంగా కబడ్డీ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు మరపాల గిరిబాబు, క్లబ్ కార్యవర్గ సభ్యులను ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అభినందించింది. బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ ఎన్.చంద్రమోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్ కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, ట్రజరర్ డీ రమేష్, మేనేజర్ బీ నాగాంజనేయులురెడ్డి పాల్గొన్నారు.
పురుషుల జట్టు
గాలి లక్ష్మారెడ్డి, జీ సమరసింహారెడ్డి, జీ బాలకృష్ణారెడ్డి, కే వెంకటేష్, వై రాజశేఖరరెడ్డి, కే ప్రసాద్‌రెడ్డి, బీ భరత్ రెడ్డి, కే హరిప్రసాద్‌రెడ్డి, కే రామాంజిరెడ్డి, జీ లక్ష్మారెడ్డి, పీ బ్రహ్మారెడ్డి, బీ సురేష్ రెడ్డి, ఎన్ ఉమామహేశ్వరరావు, పీ వినీత్‌రెడ్డి, కే బ్రహ్మయ్యతో జట్టు ఏర్పాటు చేశారు.

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య