అధికారులే సపోటా తోటను ధ్వంసం చేశారు
● రైతు చిమ్మిరి బ్రహ్మయ్య ఆవేదన
ఉలవపాడు: సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం అవసరమని, తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తన 35 సెంట్ల సపోటా తోటను ప్రభుత్వ అధికారులు అక్రమంగా సోమవారం జేసీబీతో ధ్వంసం చేశారని మండలంలోని మన్నేటికోటకు చెందిన రైతు చిమ్మిరి బ్రహ్మయ్య రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం పొలంలోకి విద్యుత్, పంచాయతీ అధికారులు వచ్చిన సమయంలో ఎందుకు కొలతలు వేస్తున్నారని అడిగానన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నామని చెప్పడంతో, తన పొలంలో ఎలా నిర్మిస్తారని, వెంటనే సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆమె తహసీల్దార్‌ని పిలిచి రైతుతో మాట్లాడి న్యాయం చేసి భూమి తీసుకోమని చెప్పారన్నారు. అయితే సోమవారం ఎలాంటి నోటీసు, సమాచారం లేకుండా తన పొలాన్ని ధ్వంసం చేశారన్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఉన్న సపోటా చెట్లు, వాటి కాపును కూడా జేసీబీతో తొలగించారని వాపోయారు.


