దుర్నీతి పాలనకు వడ్డీతో సహా చెల్లిస్తాం
● వైఎస్సార్‌సీపీ ఉదయగిరి
సమన్వయకర్త మేకపాటి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్నీతి పాలనకు తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కూటమి నేతలు తమ పలుకుబడి ఉపయోగించి బెయిల్ రాకుండా కుట్రలు పన్నడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాలన అందించడం మానేసి అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాకాణి రైతుల సమస్యలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బలంగా వినిపిస్తున్నారని, ఆయన గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టారన్నారు. కూటమి దుర్నీతిపై ఎవరు గొంతెత్తినా ఆ గొంతులు నొక్కాలని పనిగా పెట్టుకున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ఇప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పాలన విస్మరించి అక్రమ కేసులతో అందరిని భయ పెట్టాలంటే కుదరదని, ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


