గంజాయి ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సంతపేట పోలీస్‌స్టేషన్లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ స్థానిక ఇన్‌స్పెక్టర్ జి.దశరథరామారావుతో కలిసి వివరాలను వెల్లడించారు. ఇటీవల నెల్లూరు నగరంలో మత్తులో నేరాలు జరుగుతుండటంతో ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈక్రమంలో పొర్లుకట్ట నుంచి పెన్నా నదికి వెళ్లే రహదారిలో ఈనెల 23వ తేదీన గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందింది. ఆయన, ఎస్సై బాలకృష్ణ, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన రంజిత్ నాయక్, భానుప్రకాష్, నెల్లూరు ప్రగతినగర్ తొమ్మిదో వీధికి చెందిన పాత నేరస్తుడు షేక్ హుస్సేని అలియాస్ హుస్సేన్, ప్రగతి నగర్ ఐదో వీధికి చెందిన పాత నేరస్తుడు షేక్ రఫీ అలియాస్ గాంధీ, వెంకటేశ్వరపురానికి చెందిన పి.వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా విక్రయాల గుట్టును వెల్లడించారు.
వ్యసనాలకు బానిసై..
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపూర్ గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. నారాయణరెడ్డిపేటలో ఉంటూ రైస్‌మిల్లుల్లో కూలి పనులు చేసేవాడు. అతడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో డబ్బు కోసం గంజాయి విక్రయాలకు తెరలేపాడు. ఒడిశా రాష్ట్రంలో కేజీని రూ.5 వేలకు కొనుగోలు చేసి నెల్లూరుకు తీసుకొచ్చి తనకు తెలిసిన వారైన హుస్సేని, రఫీ, భానుప్రకాష్, వంశీకృష్ణకు రూ.20 వేల చొప్పున విక్రయించేవాడు. వారు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కోదానిని రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. వారికి ఒక కేజీపై రూ.30 వేల వరకు లాభం వచ్చేది. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో గట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. నిందితులు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. హుస్సేని, రఫీలు పాతనేరస్తులని, వారిపై పలు కేసులున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై, ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెచ్‌సీలు సుబ్బారావు, మల్లికార్జున, విజయమోహన్, పీసీలు అల్లాభక్షు, ఎం.వెంకటేశ్వర్లు, జి.గోపీలను ఆమె అభినందించారు.
ఒడిశా నుంచి దిగుమతి
చిన్న ప్యాకెట్లు చేసి విక్రయాలు


