
జల్సాలకు బానిసై చోరీలు
● ఇద్దరు మోటార్‌బైక్‌ల దొంగల అరెస్ట్
● రూ.10 లక్షల విలువైన 11 వాహనాలు స్వాధీనం
నెల్లూరు సిటీ: మోటార్‌బైక్‌లు చోరీ చేసి, విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం సీఐ వేణు వివరాలు వెల్లడించారు. కోటమిట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ సిద్ధిఖ్, వెంకటేశ్వరపురం భగత్‌సింగ్ కాలనీకి చెందిన పఠాన్ రోషన్ మద్యానికి బానిసలయ్యారు. జల్సాలకు డబ్బు లేకపోవడంతో బైక్‌లు ఎత్తుకెళ్లి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. నెల్లూరు నగరంతోపాటు కావలి, గూడూరు పట్టణాల్లో బైక్ చోరీలకు పాల్పడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ వేణు, ఎస్సై బి.లక్ష్మణ్, ఏఎస్సై ఎస్‌కే రఫీ, హెడ్‌కానిస్టేబుళ్లు ఆదినారాయణ, చిరంజీవి, కానిస్టేబుళ్లు మోహన్‌బాబు, మోహన్‌కృష్ణ ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. సోమవారం ధనలక్ష్మీపురం సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షలు విలువైన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నెల్లూరు రూరల్ పరిధిలో ఒక బైక్, కావలి పట్టణంలోని పీఎస్2లో రెండు, పీఎస్1లో ఒకటి, గూడూరు పీఎస్3లో మూడు, గూడూరు పీఎస్2లో రెండు, మరికొన్ని గుర్తుతెలియని బైక్‌లున్నాయి. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించారు.