
సోమశిలకు 37,750 క్యూసెక్కుల వరద
సోమశిల: జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 37,750 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. పెన్నానదికి 34,978 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 280, కండలేరుకు 10,450 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 72.574 టీయంసీల నీరు నిల్వ ఉంది.
55వేల క్యూసెక్కుల విడుదల
సంగం: సోమశిల నుంచి సంగం బ్యారేజ్‌కు భారీగా వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు సంగం బ్యారేజ్ 50 గేట్లు ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నాలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా జలకళను సంతరించుకున్న సంగం బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకిడి కనిపించింది.
నేటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన పాఠశాలలకు సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అన్ని యాజమాన్యాలు పాటించాలన్నారు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రేపు రామాయపట్నం పోర్టుకు కాకాణి
కందుకూరు: రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ మంగళవారం పరిశీలించనున్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రారంభమైన రామాయపట్నం పోర్టు పనులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది. గతేడాది కాలంగా రామాయపట్నం పోర్టు పనులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో పనుల పురోగతిని పరిశీలించేందుకు కాకాణి పోర్టు నిర్మాణ ప్రాంతానికి రానున్నారు.