
ఉదయగిరి సీహెచ్‌సీలో విచారణ
ఉదయగిరి రూరల్: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన మంజుల ప్రసవ సమయంలో పురిటిబిడ్డ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం వైద్యులు సీహెచ్ కిరణ్, ఎం.బెట్టి జనాల్, ఆర్వీ హరిత విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. డీసీహెచ్‌ఎస్ పరిమళ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, బాధిత కుటుంబంతో మాట్లాడామన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.