
ఉరేసుకుని యువతి ఆత్మహత్యాయత్నం
● సీహెచ్‌సీలో వైద్యులు లేక పోయిన ప్రాణం
వెంకటాచలం: ఉరేసుకుని యువతి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం వెంకటాచలం క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రాత్రి 7.30 నుంచి 8.40 గంటల వరకు వైద్యులు రాకపోవడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మండలంలోని కసుమూరు గ్రామానికి చెందిన మల్లి పూర్ణ (23)కు వచ్చే నెల 8వ తేదీన వివాహం జరగనుంది. అయితే ఏమైందో తెలియదు కానీ తన నివాసంలో ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వైద్యులు అందుబాటులో ఉండుంటే తమ బిడ్డ బతికి ఉండేదని పూర్ణ తండ్రి మల్లి శీనయ్య తన ఆవేదన వ్యక్తం చేశాడు. క్లస్టర్ ఆరోగ్య కేంద్రం వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పూర్ణ కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి పంపేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.