
25న కొత్త ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు
నెల్లూరు (టౌన్): డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులకు ఈ నెల 25న అమరావతిలో సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నట్లు డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు అభ్యర్థులు వారి సహచరులతో ఈ నెల 24న వెంకటాచలం మండలం గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటల్లోపు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఉపాధ్యాయులు వారి సహచరులకు అవసరమైన దుప్పట్లు, గొడుగులు, వాటర్ బాటిళ్లు వారే తెచ్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు గొలగమూడి ఆశ్రమం వద్ద అందజేయనున్నట్లు తెలిపారు. ఐడీ కార్డులు ఉంటేనే ఉపాధ్యాయులు, వారి సహచరులను ముఖ్యమంత్రి కార్యాక్రమానికి అనుమతిస్తారన్నారు.
వీఎస్‌యూ వీసీకి
విశిష్ట గౌరవం
వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) వీసీ అల్లం శ్రీనివాసరావుకు మరో విశిష్ట గౌరవం లభించింది. ప్రపంచంలో అగ్ర శాస్త్రవేత్తల జాబితాలో రెండో విభాగం శాస్త్రవేత్తలు ఉన్న జాబితాలో ఆయనకు స్థానం లభించింది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ జాబితాలో చోటు లభించడం విశేషం. భౌతికశాస్త్రం, పొటానిక్స్ విభాగాల్లో అల్లం శ్రీనివాసరావు చేసిన పరిశోధనలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఇప్పటి వరకు ఆయన 270కు పైగా పరిశోధనా పత్రాలు, పుస్తక అధ్యయాలు ప్రచురించగా, 25 మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకం వహించారు. ఈ విశిష్ట గౌరవం పొందిన వీసీ అల్లం శ్రీనివాసరావును మంగళవారం వీఎస్‌యూలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది శాలువా కప్పి సన్మానించారు.