అనుమతిచ్చిన ఇసుక మాఫియా డాన్‌ ఎవరు | - | Sakshi
Sakshi News home page

అనుమతిచ్చిన ఇసుక మాఫియా డాన్‌ ఎవరు

Sep 24 2025 7:39 AM | Updated on Sep 24 2025 7:39 AM

అనుమతిచ్చిన ఇసుక మాఫియా డాన్‌ ఎవరు

అనుమతిచ్చిన ఇసుక మాఫియా డాన్‌ ఎవరు

పెరమన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక తవ్వకాలకు ఆత్మకూరు నియోజకవర్గంలో అసలు ఏ అనుమతే లేదని, పెరుమాళ్లపాడులోని ఇసుక రీచ్‌ అనుమతి ఇచ్చిన ఇసుక మాఫియా డాన్‌ ఎవరని, రీచ్‌లోకి గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్‌ ఏ విధంగా అనుమతిచ్చారని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నిలదీశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విక్రమ్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ సంగం మండలం పెరమన సమీపంలో ఇటీవల అక్రమంగా అధిక టన్నేజీతో వెళ్తున్న ఇసుక టిప్పర్‌ ఢీకొనడంతో ఐదు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందడం విచారకరమన్నారు. ఆ రోజు అక్రమ ఇసుక తవ్వకాలు చేయకుండా ఉండి ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదన్నారు. ఇసుక మాఫియా దుర్మార్గానికి ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో ఇసుక మాఫియా డాన్‌ వివిధ ఇసుక రీచ్‌ల ద్వారా రోజుకు 150 టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తూ రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి ఓ కారణమన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్పీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారని, నిందితుడు తమ అదుపులో ఉన్నట్లుగా తెలిపారని, ఈ ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అయితే ఇంత వరకు తీసుకున్న చర్యలేమిటో తెలియడం లేదన్నారు. ఆ రోజు సాయంత్రమే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం తప్పులు నమోదు చేశారని, టిప్పర్‌ నంబరు కాకుండా కారు నంబరు వేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఏ–1గా డ్రైవర్‌, ఏ–2గా వాహన యజమాని, ఏ–3గా ఇసుక అక్రమ రవాణాదారుడు బుజ్జయ్యనాయుడు అని నమోదు చేశారని, అయితే తప్పు తెలుసుకున్న తర్వాత టిప్పర్‌ నంబరు పెట్టి ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేశారన్నారు. దీన్ని బట్టి పోలీసులపై ఎంతటి ఒత్తిడి ఉందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న మాఫియాలపై దృష్టి సారించితే మంచిదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి రూ.50 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు వంతున ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు అది వారికి అందిందో లేదో కూడా తెలియలేదన్నారు. ప్రమాదం తర్వాత బాధ్యత వహించాల్సిన మంత్రి ఆ కుటుంబాలను ఆదుకోపోగా, /నాలుగు లేన్ల రోడ్లు మంజూరు చేయాలని కోరడం ఏమిటో అర్థం కాలేదని విక్రమ్‌రెడ్డి విమర్శించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ పూర్తిగా నిలుపుదల చేయాలని, బెల్ట్‌ షాపులన్నింటిని మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర్‌రెడ్డి, జోనల్‌ మహిళా అధ్యక్షురాలు మహిళ గౌరీ, ఆత్మకూరు జెడ్పీటీసీ లక్ష్మీప్రసన్న, జిల్లా బూత్‌ కమిటీ విభాగం అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, నాయకులు రఘునాథరెడ్డి, శ్రీనివాసనాయుడు, మండల కన్వీనర్లు శంకర్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement