పోర్టు సందర్శనేమైనా దేశ ద్రోహమా | - | Sakshi
Sakshi News home page

పోర్టు సందర్శనేమైనా దేశ ద్రోహమా

Sep 24 2025 7:39 AM | Updated on Sep 24 2025 7:39 AM

పోర్టు సందర్శనేమైనా దేశ ద్రోహమా

పోర్టు సందర్శనేమైనా దేశ ద్రోహమా

కందుకూరు: రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు సందర్శించడం ఏమైనా దేశద్రోహ చర్యా లేక ఉగ్రవాద కార్యకలాపాలా అంటూ మండిపడ్డారు. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయట పడతాయనే ఉద్దేశంతోనే తమను అడ్డుకుంటున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లాలో పోలీస్‌లు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్నారు. ఇది సరైన విధానం కాదని, రేపు ప్రభుత్వం మారితే ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రామాయపట్నం పోర్టు వద్ద మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కందుకూరు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు సందర్శించేందుకు ముందుగానే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామని, అయితే కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోర్టు సందర్శనకు వెళ్లకుండా తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. పోర్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి బయట పడుతుందనో లేకపోతే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుస్తుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు తమను పోర్టు పరిసరాల్లోకి కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి దశలో రూ.4,924 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వివరించారు. 2020లోనే పోర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చి, 2022లో భూమిపూజ చేసి వెంటనే పనులు ప్రారంభించారని తెలిపారు. అనంతరం 794 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 34 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా నాలుగు బెర్తుల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు రూ.985 కోట్లు ప్రభుత్వం తరఫున, రూ.3,938 కోట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా నిధులు కూడా మంజూరు చేశారన్నారు. ఇలా అన్ని అనుమతులతో పాటు భూమి, నిధులు సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం వల్ల జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 51 శాతం పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. ఒక బెర్తు నిర్మాణం కూడా పూర్తి చేశారని, కస్టమ్స్‌ అనుమతలు రాకపోవడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడంలో ఆలస్యమైందన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నిర్వాకం వల్ల పోర్టు నిర్మాణం పూర్తిగా అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కమీషన్ల కక్కుర్తితోనే

పోర్టు పనుల నిలిపివేత

తమ ప్రభుత్వ హయాంలో 51 శాతం పోర్టు పనులు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలనా కాలంలో కనీసం 10 శాతం పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్‌లను ఎవరిని తరిమేద్దాం, ఎవడు కమీషన్లు ఇస్తాడనే ఆలోచన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ చేస్తున్నారని, దీనికి అనుగుణంగా తనకు ఎవరు డబ్బులిస్తే ఆ కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వాలనే స్థానిక ఎమ్మెల్యే కక్కుర్తి వల్ల పోర్టు నిర్మాణం అటకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉండే బడా నాయకులు ప్రజల అవసరాలు, ఉపాధి అవకాశాలు పక్కన పెట్టి తమకు కమీషన్లు వస్తే చాలు అన్న ధోరణి వల్లే 15 నెలలుగా పనులు నిలిపేశారని విమర్శించారు. డీల్‌ కుదిరిన తరువాత ప్రస్తుతం ఓ కంపెనీకి పనులు అప్పగించినా నేటికి 10 శాతం పనులు కూడా చేయని దుస్థితి ఉందన్నారు.

అభివృద్ధిని చూపించిన

నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి

అసలు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని కాకాణి వివరించారు. రూ.5,550 కోట్లతో 35 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మచిలీపట్నం పోర్టు, 23.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రూ.5 వేల కోట్ల ఖర్చుతో మూలపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్‌ కాదా అని ప్రశ్నించారు. దాదాపు రూ.15 వేల కోట్ల ఖర్చుతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపట్నం పోర్టుల్లో 30 వేల మందికి ఉపాధి కల్పించేలా మారిటైమ్‌ బోర్డు ద్వారా నిధులు సమీకరించి పనులు ప్రారంభించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. కానీ నేటి ప్రభుత్వం కాసులకు పోర్టులను అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు.

రామాయపట్నం పోర్టు పనులను వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలిస్తే తప్పేంటి

పోర్టు నిర్మాణంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమాలు

బయటకు వస్తాయనే అడ్డగింత

మా ప్రభుత్వం 15 నెలల్లోనే 51 శాతం పనులు పూర్తి చేస్తే, కూటమి 5 శాతం కూడా పూర్తి చేయలేదు

జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి

ప్రజలకు తెలియకూడదనే కుట్ర

ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తి వల్లే పోర్టు నిర్మాణం అటకెక్కింది

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement