
పెద్దాస్పత్రికెళ్తే రోగాలు ఫ్రీ
●
ఓపీ రాసే గది పక్కనే సీ్త్రలు, పురుషులు ఉపయోగించే మరుగుదొడ్డి
ఓపీ చీటీల కోసం క్యూలో ఉన్న రోగులు
నెల్లూరు (అర్బన్): జిల్లాకు రెఫరల్ ఆస్పత్రి అయిన జీజీహెచ్‌లో దారుణ పరిస్థితులున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్యసేవల్లో నిర్లక్ష్యం పెరిగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ వైద్య స్థాయిలో సేవలందించిన జీజీహెచ్‌లో గైనకాలజీ, మెడిసిన్, ఐసీయూ, ఎమర్జెన్సీ, కంటి విభాగం, పల్మనాలజీ, చిన్నపిల్లల విభాగం ఇలా వివిధ వార్డుల్లో రోగులు సుమారు 500 మందికి పైగానే రోజూ ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారు. ఏ వార్డులో చూసినా మరుగుదొడ్లు దుర్గంధంతో నిండిపోయి ఉన్నాయి.
శానిటేషన్ పట్టని అధికారులు
ఆస్పత్రిలో 150 పారిశుద్ధ్య కార్మికులున్నారు. వీరిలో 20 మంది ఎఫ్‌ఎన్‌ఓలు ఉన్నారు. మిగిలిన వారు సక్రమంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. దుర్గంధం భరించలేకనే అనేకమంది అడ్మిట్ అయ్యేందుకు ఇష్టపడడం లేదు. సుమారు 40 శాతం మంది అడ్మిట్ కాకపోవడానికి బాత్‌రూంల కంపు కారణమని రోగులతోపాటు సిబ్బంది పేర్కొంటున్నారు. పేరుకే ముగ్గురు అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఎనిమిది మంది రెగ్యులర్ సూపర్‌వైజర్లు, 15 మంది అవుట్ సోర్సింగ్ సూపర్ వైజర్లున్నారు. వీరెవరూ రౌండ్స్ వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.
ఒకటే దారి
వైద్యం కోసం 1,200 నుంచి 1400 మంది క్యూలో నిలబడి రోజూ ఓపీ చీటీలు తీసుకుంటున్నారు. అయితే ఓపీ తీసుకునే పక్కనే మరుగుదొడ్డి ఉంది. అందులో రెండు గదులుండగా ఒకదానిని బ్లాక్ చేశారు. లోపలికి వెళ్లాలన్నా సీ్త్ర, పురుషులకు ఒకే దారి. బయట పెన్సిల్‌తో జెంట్స్ టాయిలెట్ అని రాసి ఉంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నెల్లూరులోని కొండాయపాళేనికి చెందిన బత్తల నారాయణమ్మకి బీపీ పెరిగిపోయింది. కాలు, చేయి చచ్చుబడ్డాయి (పెరాలసిస్). పేదరాలైన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పెద్దాస్పత్రి (సర్వజన ఆస్పత్రికి)కి వైద్యం కోసం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం వచ్చి జనరల్ మెడిసిన్ విభాగం కింద ఫిమేల్ మెడికల్ వార్డులో అడ్మిట్ అయ్యారు. వైద్యం బాగా చేస్తారని సంబంధిత డాక్టర్‌కు రాజకీయ నాయకులతో ఫోన్ చేయించుకున్నారు. పక్కరోజు డిశ్చార్జి చేయాలని రోగి డాక్టర్‌ను అడిగారు. వారు వైద్యం సక్రమంగా అందలేదా అని ప్రశ్నిస్తే అలాంటిదేమి కాదు.. ముందే నేను నడవలేను. టాయ్‌లెట్‌కు పోవాలంటే నరకం కనిపిస్తోంది. శుభ్రత లేదు. లైట్లు వెలగవు. కంపు భరించలేకున్నా. కొత్త జబ్బులు వచ్చేలా ఉన్నాయి. ప్రైవేట్ వైద్యశాలకు వెళ్తా అని డిశ్చార్జి అయ్యింది.
పారిశుద్ధ్యానికి నెలకు రూ.లక్షల్లో ఖర్చు
ఓపీ చీటీలు రాసే చోట సీ్త్ర, పురుషులకు ఒకటే టాయ్‌లెట్
వార్డుల్లోని మరుగుదొడ్లు కంపు కంపు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో
కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో క్లీనింగ్
కూటమి పాలనలో నిర్లక్ష్యం

పెద్దాస్పత్రికెళ్తే రోగాలు ఫ్రీ