
పక్షపాత అధికారుల భరతం పడుతాం
● కార్యకర్తలకు అండగా నిలిచేందుకు
డిజిటల్ బుక్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): అధికార మదంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, వీరి అండ చూసుకుని పక్షపాతంతో వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టేందుకే డిజిటల్ బుక్‌ను ప్రారంభించినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అన్యాయానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యూఆర్ కోడ్‌తో కలిగిన డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారని తెలిపారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీ, వెంకటగిరి సమన్వయకర్త నేదరుమల్లి రాంకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ ముఖ్య నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టిన, పెట్టే వారిపై ఫిర్యాదు చేసేందుకు డిజిటల్ బుక్ ఒక అస్త్రమన్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారిపై కార్యకర్తలు, ఈ బుక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చునన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఫిర్యాదు చేసిన వారిపై తప్పకుండా శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, నాయకులు బొబ్బల శ్రీనివాసులు యాదవ్, పేన్నేటి కోటేశ్వరరెడ్డి, మందల వెంకటశేషయ్య తదితరులు ఉన్నారు.