
ఇళ్ల నిర్మాణంపై అబద్ధాల చంద్రబాబు అసత్యాలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 15 ఏళ్లలో పేదల ఇళ్ల నిర్మాణం గురించి ఏమాత్రం ఆలోచన చేశాడో ప్రజలందరికీ తెలుసునని, తాజాగా అసెంబ్లీ వేదికగా ఇళ్ల నిర్మాణంపై పచ్చి అబద్ధాలు వల్లెవేశాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కాకాణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం 6.15 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లు నిర్మించిందని, అందుకోసం రూ.2200 కోట్లు ఖర్చు చేశామని, దీపావళి కానుకగా మరో 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని నిస్సిగ్గుగా మరో అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీలకు రూ.50 వేల, ఎస్టీలకు రూ.70వేల, ఆదివాసీలకు రూ.లక్ష వరకు పెంచి ఇస్తున్నామని మరో అబద్ధాన్ని కళ్లార్పకుండా చెప్పాడన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు లేదా మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తున్నామని, ప్రజలు ఛీదరించుకుంటారన్న సోయ లేకుండా 2029 నాటికి ఇళ్లు లేని వారు ఎవరూ ఉండరని అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో
9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
వైఎస్సార్‌సీపీ హయాంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఐదేళ్లలో 31.19 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. దాదాపు 22 లక్షల కు టుంబాలకు ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణాలు ప్రారంభించామని, తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9.02 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో ఏరియాలో వందల ఎకరాల్లో 10 వేలకు పైగా లేఅవుట్లు వేసి ఊర్లను తలపించేలా కొత్తగా ఇల్లు నిర్మించామన్నారు. మొత్తం 71,811 ఎకరాలు సేకరించామని, ఎకరం ఐదారు కోట్ల విలువ చేసే భూములను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కొని పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. ఒక్కో ప్లాటు విలువ రూ. 3.50 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ధర పలుకుతోందని, రూ.76 వేల కోట్ల విలువైన ప్లాట్లను పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు ఏర్పాటయ్యాయని, చాలా ఇళ్లు అనేక దశల్లో ఉన్నాయన్నారు. దాదాపు 2 లక్షల టిడ్కో ఇళ్లను ఒక్క రూపా యికే పేదలకు వైఎస్ జగన్ అందించారని, కానీ కూట మి ప్రభుత్వం వచ్చాక వాటికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే పేరును తీసేసి పీఎంఏవై ఎన్టీఆర్ నగర్‌లుగా మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 2024 ఎన్నికల నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తయ్యే దశలో ఉంటే వాటిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడన్నారు.
ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది బాబే
వైఎస్ జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే దాదాపు వెయ్యి కేసులేసి అడ్డుకోవాలని చూశాడని, ఆఖరుకు అమరావతి రాజధానిలో పేద ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీల కు వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలిస్తే దాన్ని కూడా కేసులేసి చంద్రబాబు అడ్డుకున్నాడన్నారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ 50,793 ఇళ్లకు ఒకే చోట పట్టాలు పంచిన చరిత్ర జగన్‌కే దక్కుతుందన్నారు. సెంటు స్థలం సమాధి కట్టుకోవడానికి కూడా పనికిరాదని ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పేదల ఇళ్లపై విషప్రచారం చేశాడని, ఇంటి స్థలంపై పేద వాడికి సర్వ హక్కులు కలిగేలా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్వేయన్స్ డీడ్ పేదల పేరుతో ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు ఓర్చుకోలేకపోయాడన్నారు. కరోనా, కోర్టు కేసులు అధిగమించి రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ఇచ్చిందని, డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిని ఆదుకోవడానికి రూ.35 వేలు పావలా వడ్డీకే ఇచ్చారన్నారు. రూ.15 వేలు విలువ చేసే ఉచిత ఇసుకతో పాటు స్టీల్, సిమెంట్ వంటి 12 రకాల సామగ్రి కొనుగోళ్లలో రూ.40 వేల మేర లబ్ధి చేకూర్చారన్నారు. ఆ విధంగా ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 2.70 లక్షల మేర ఖర్చు చేశామని, వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంటి నిర్మాణం కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.32,909 కోట్లు అని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో కాలక్షేపం
అసెంబ్లీ సమావేశాలు కూటమి సభ్యుల కాలక్షేపానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని నిందించడానికి, చంద్రబాబు, లోకేశ్ గొప్పలు చెప్పి పొగిడించుకోవడానికే వాడుకున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చలు జరిగినట్టే కనిపించలేదన్నారు. సభ్యుల నోటి వెంట నోరు తెరిస్తే అబద్దాలు తప్ప మరోటి వినిపించలేదని, ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలకు చిరంజీవి ఇచ్చిన కౌంటరే ఉదాహరణ అన్నారు.
15 ఏళ్లలో పేదల గృహాలను
పట్టించుకోలేదు
కూటమి ప్రభుత్వంలో 3 లక్షల ఇళ్లకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశామనడం నిస్సిగ్గు
వేదిక ఏదైనా సరే కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట
గత ప్రభుత్వంలో చేసిన పనులు తన ఖాతాలో వేసుకుంటూ అసత్యాలు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రూ.2,203 కోట్ల అవినీతి
ఇళ్ల నిర్మాణం పేరుతో పేదవాడి మీద భారం మోపిన ఘనుడు చంద్రబాబు అని, 2016–17లో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 415 చదరపు అడుగుల్లో మూడు రకాల ఇళ్లను మూడు అంతస్తుల్లో నిర్మిస్తానని హామీ ఇచ్చాడన్నారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగే ప్లాటుకు రూ. 2.60 లక్షల ధర నిర్ణయించి వారికి బ్యాంకు రుణం ఇప్పించి వారు నెల నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు దాదాపు రూ. 7.20 లక్షలు చెల్లించేలా ప్రణాళిక రూపొందించాడన్నారు. ఆ విధంగా పేదవాడి మీద బాంబు వేశాడన్నారు. నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నాడని, ముడుపులు ఎక్కువగా ఇచ్చిన వారికి ఎక్కువ ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టాడని, 2016–17 మధ్య కాలంలో ఇంటి నిర్మాణం చదరపు అడుగుకి రూ.900 నుంచి రూ. వెయ్యి వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రూ. 2,534.75 నుంచి రూ.2,034.50లకు ఇచ్చాడన్నారు. ఆ విధంగా రూ.2,203 కోట్లు దోచుకుతిన్నాడని, పేదవాడి ఇంటి నిర్మాణంలో కూడా చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డాడన్నారు. ఆ రోజు మార్కెట్ ధరతో పోల్చితే పేదల నుంచి రూ.1200 అదనంగా వసూలు చేశాడన్నారు.