టీడీపీలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ చిచ్చు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ చిచ్చు

Nov 23 2025 5:41 AM | Updated on Nov 23 2025 5:41 AM

టీడీప

టీడీపీలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ చిచ్చు

అంకమ్మతల్లి ఆలయంలో

నిర్మాణాలు వివాదాస్పదం

కోర్టు తీర్పును ధిక్కరించి చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే దివి శివరాం గరంగరం

నిర్మించి తీరుతామని భీష్మించిన ఎమ్మెల్యే ఇంటూరి

భారీగా పోలీసులను మోహరించి పనులు చేపట్టేందుకు సిద్ధమైన అధికారులు

అడ్డుకున్న శివరాంను లాగేసిన పోలీసులు

కందుకూరు: గ్రామదేవత అంకమ్మ తల్లి ఆలయ స్థలంలో జరుగుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం టీడీపీలో చిచ్చు రేపింది. ఆది నుంచి ఆలయంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వర్గాల మధ్య ఈ వివాదం రచ్చకెక్కేలా చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి జరుగుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని ఓ వర్గం, కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటూ మరో వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను అడ్డుకునేందుకు శివరాం తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పనులు జరగడానికి వీల్లేదంటూ శివరాం అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు శివరాంను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయొద్దని కార్మికులు, ఆలయ ఈఓ కార్తీక్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కార్మికులు దూరంగా వెళ్లిపోయారు. పనులు చేయండి తాము ఉన్నామంటూ అధికారులు చెబుతుండడం, పనులు చేయడానికి వీల్లేదంటూ శివరాం హెచ్చరికలు జారీ చేస్తుండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగింది.

నిర్మాణం జరగనిచ్చే ప్రసక్తే లేదు

అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతో ఆలయంలో జరిగే ఉత్సవాలకు, తిరునాళ్లకు ఇబ్బందులు ఏర్పడుతాయంటూ మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతోపాటు, ఆలయ నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు. కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే నిర్మాణానికి హైకోర్టు అనుమతి ఇచ్చిందంటూ దాదాపు 19 షాపులను నిర్మించారు. తాజాగా మరో 6 షాపుల నిర్మాణాన్ని ప్రారంభించగా దీన్ని దివి శివరాం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో హైకోర్టు ఆలయ ప్రాంగణంలోని 1.52 ఎకరాల ఖాళీ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని స్పష్టంగా చెప్పినా తీర్పును ధిక్కరించి మరీ నిర్మాణాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈఓ కార్తీక్‌ మాత్రం కోర్టు ఉత్తర్వుల మేరకే నిర్మాణం జరుగుతుందని, ఆ ఖాళీ స్థలంలో తాము ఎటువంటి నిర్మాణం చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదాన్ని తేల్చేందుకు స్థలాన్ని సర్వే చేయించాలని శివరాం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం చిలినిచినికి గాలివానగా మారింది. దీంతో శివరాం రెండు రోజులుగా ఆలయం వద్దే తిష్ట వేశారు.

నన్ను అరెస్టు చేసుకోండి.. కదిలే ప్రసక్తే లేదు

షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను జరగనిచ్చే ప్రసక్తే లేద ని శివరాం భీష్మించుకు కూర్చోవడంతో, పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అవసరమైతే నన్ను అరెస్టు చేసుకోండి గాని, ఇక్కడి నుంచి కదిలేది తేల్చిచెప్పారు. దీంతో పోలీసులకు, శివరాం మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. అయితే అరెస్టు చేసేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ హైడ్రామా మున్సిపల్‌ కార్యాలయానికి చేరింది. ఆదివారం సర్వే చేయిస్తామని, ఆలయ ఈఓ కార్తీక్‌ ఇక్కడే ఉండాలంటూ శివరాం చెప్పారు. తాను అక్కడే ఉంటానంటూ ఈఓ చెప్పడంతో దివి శివరాం శాంతించారు.

టీడీపీలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ చిచ్చు 1
1/1

టీడీపీలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ చిచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement