తొలిరోజు నిరాశే.. | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు నిరాశే..

Apr 10 2026 11:03 AM | Updated on Apr 10 2026 11:03 AM

పొగాకు వేలం ప్రారంభం

గరిష్టంగా కిలో రూ.250 పలికిన వైనం

గతేడాది తొలిరోజు గరిష్ట ధర రూ.280

నష్టపోతామని రైతుల ఆవేదన

కలిగిరి/మర్రిపాడు: పొగాకు రైతులకు తొలిరోజే నిరాశ ఎదురైంది. ఆశించిన స్థాయిలో ధర లభించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఖర్చులు బాగా పెరిగాయి. గత సంవత్సరం వేలం మొదలైన తొలిరోజే రూ.280 గరిష్ట ధర లభించింది. ఈసారి ఆ పరిస్థితి కనిపించలేదు.

కంపెనీలు ముందుకు రాకపోవడంతో..

గురువారం కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రారంభమైంది. ఉదయం వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్‌, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుత్తలూరు మండలం లక్ష్మీపురం రైతులు 18 పొగాకు బేళ్లను తీసుకొచ్చారు. రాజశేఖర్‌ కిలో రూ.251తో వేలం ప్రారంభించారు. అయితే కంపెనీల ప్రతినిధులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తగ్గిస్తూ వచ్చారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 నుంచి కంపెనీల ప్రతినిధులు కొనుగోలు ప్రారంభించారు. మొత్తం 18 బేళ్లను కిలో రూ.250 వంతున కొనుగోలు చేశారు. 7 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనం ఉన్నాయన్నారు. 75 శాతం బ్రైట్‌ (హైగ్రేడ్‌), మీడియం గ్రేడ్‌ ఉత్పత్తి వచ్చిందన్నారు. రైతులు గ్రేడ్ల వారీగా బేళ్లను తయారు చేసుకుని అమ్మకాలకు తీసుకురావాలన్నారు. గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ రామారావు, రైతు సంఘం అధ్యక్షుడు రావూరి శ్రీకాంత్‌బాబు, రైతు సంఘం నాయకులు వేళ్ల నరేంద్ర, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

డీసీపల్లిలో ఇలా..

మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ తొలిరోజు రైతులు తీసుకొచ్చిన 18 బేళ్లను పూర్తిగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. వేలంలో మొత్తం 8 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. కిలో గరిష్ట, కనిష్ట ధర రూ.250 రూపాయలుగా నమోదైనట్లు చెప్పారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడుతూ గతేడాది కిలోకు రూ.280 ధర నమోదు కాగా, ఈసారి రూ.250కే పరిమితమవడంతో రైతులకు నష్టాలు తప్పవన్నారు. ఇటీవల వ్యవసాయ పెట్టుబడులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కనీసం కిలోకు రూ.350 ధర వచ్చినప్పుడే లాభం ఉంటుందన్నారు. పొగాకు నాణ్యత బాగున్నప్పటికీ ధర తగ్గడంతో రైతులు నిరాశ వ్యక్తం చేశారు.

చర్యలు తీసుకోవాలి

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాగుకు 15 శాతం పెట్టుబడులు పెరిగాయి. నాడు వేలం ప్రారంభంలో కిలో గరిష్టంగా రూ.280 ధర పలికింది. ఏడాది మొత్తంలో సరాసరి కిలో పొగాకుకు రూ.230 లభించింది. ప్రస్తుతం ప్రారంభంలోనే గరిష్ట ధర రూ.250 వచ్చింది. ఈ ధరలతో పొగాకు అమ్ముకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకోవాలి.

– పూసాల అక్కపునాయుడు, రావులకొల్లు, కలిగిరి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement