
తిమ్మమ్మ మర్రిమాను బాహ్య చిత్రం
ఎన్‌పీకుంట/కదిరి అర్బన్: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వృక్షంగా పేరుగాంచిన తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. కోరిన కోర్కెలు తీర్చే మహావృక్షంగా ఖ్యాతి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద గురువారం నుంచి శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే తిమ్మమాంబ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పూర్తి చేశారు.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా...
ఎన్‌పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను 8.15 ఎకరాల్లో వేలాది ఊడలతో విస్తరించింది. ఈ మహావృక్షం వెనుక ఓ పురాణగాథ ఉంది. బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతులకు కుమార్తె తిమ్మమాంబకు గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి జీవితం బాగానే సాగింది. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడిన వీరయ్య మృతి చెందడంతో ఆ రోజుల్లో కొనసాగుతున్న ఆచారం మేరకు తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజం చిగురించి అది మహావృక్షంగా ఎదిగింది. అప్పటి నుంచి ఈ చెట్టుకు ‘తిమ్మమ్మ’ అనే పేరు పెట్టారు. 1989లో కర్ణాటక ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సత్యనారాయణ అయ్యర్ కృషి ఫలితంగా ఈ మహా వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. అప్పటి నుంచి ప్రపంచ పర్యాటకుల దృష్టి తిమ్మమ్మ మర్రిమానుపై పడింది. మొత్తం 1,355కు పైగా ఊడలతో ఉండే ఈ మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి. ఈ ప్రాంతంలో నిర్మించిన తిమ్మమాంబ, బాలవీరయ్య ఆలయాన్ని 2011లో బెంగళూరుకు చెందిన కై వారం యోగి నారాయణస్వామి ట్రస్ట్ ధర్మాధికారి డాక్టర్ ఎంఎస్ జయరాం ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. నూతన ఆలయంలో తిమ్మమాంబ అమ్మవారు నిత్యపూజలతో అలరారుతున్నారు. ఆలయానికి ఎదురుగా తిమ్మమాంబ సతీసహగమనం చేసిన ప్రదేశంలో తిమ్మమ్మ ఘాట్‌ను అత్యంత సుందరంగా నిర్మించారు. ఇక్కడికి వచ్చే యాత్రికులకు, భక్తులకు తిమ్మమ్మ చరిత్ర, మర్రిమాను విశిష్టతను వివరించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇద్దరిని గైడ్‌లుగా నియమించారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు
ఈ నెల 7న గురువారం ఉదయం అమ్మవారి రథోత్సవంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గ్రామ వీధులతో పాటు సమీప గ్రామాల్లో అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 8న మహాశివరాత్రిని పురస్కరించుకుని తిమ్మమ్మ మర్రిమాను వద్ద జాగరణ ఉంటుంది. తిమ్మమాంబ సంపూర్ణ జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో మంగదిన్నెపల్లి రమణప్పనాయుడు బృందం వివరించే ఏర్పాట్లు చేశారు. అలాగే చెక్కభజనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగున ఉన్న అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 9న అమ్మవారికి మొక్కుబడులు సమర్పించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం తిరిగి వెళతారు. కాగా, అమ్మవారి రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్‌పీకుంట ఎంపీపీ ఈటె రాము బుధవారం తెలిపారు. గురువారం రాత్రి 7 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి రథాన్ని లాగి జాగరణ మహోత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఇలా చేరుకోవచ్చు...
తిమ్మమ్మ మర్రిమాను వద్దకు చేరుకునేందుకు ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. కదిరి–రాయచోటి మార్గంలో ఉన్న గాండ్లపెంట మండలం రెక్కమాను నుంచి ఆటోలు, బస్సులు ఉంటాయి. 8 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తే మర్రిమానుకు చేరుకోవచ్చు. అలాగే కదిరి–మదనపల్లి జాతీయ రహదారిపై కొక్కంటి క్రాస్ నుంచి ఆటో, బస్సుల్లో 12 కిలోమీటర్లు ప్రయాణించి మర్రిమానుకు చేరుకోవచ్చు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కదిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ మైనుద్దీన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కదిరి బస్టాండ్ నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు చొప్పున గాండ్లపెంట, రెక్కమాను మీదుగా బయలుదేరుతుంది. కదిరిలోని జీవిమాను సర్కిల్, గాండ్లపెంట రెక్కమాను, తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లో ప్రత్యేక స్టాపింగ్‌లు ఏర్పాటు చేశారు.
శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన తిమ్మమ్మ మర్రిమాను
నేటి నుంచి జాగరణ మహోత్సవాలు
అధిక సంఖ్యలో హాజరుకానున్న భక్తులు

తిమ్మమ్మ సతీసహగమనం చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్మారకం

కోర్కెలు తీర్చాలంటూ ముడుపులు కట్టిన దృశ్యం

ప్రత్యేక అలంకరణలో తిమ్మమాంబ మూలవిరాట్

తిమ్మమాంబ, బాలవీరయ్య విగ్రహాలు
Comments
Please login to add a commentAdd a comment