రహదారుల కోసం భూసేకరణ వేగవంతం
● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ
ప్రశాంతి నిలయం: జిల్లా పరిధిలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ చేస్తామని భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. జయశ్రీ తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కోలో ఎస్టేట్ ఆఫీసర్‌గా విజయవాడలో పనిచేస్తూ పదోన్నతిపై జిల్లా భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన జయశ్రీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, ఎన్‌హెచ్–342, 716జీ జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఆయా రహదారులకు అవసరమైన భూమి సేకరించే ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామన్నారు. అలాగే రైతులకు త్వరితగతిన పరిహారం అందించడంతోపాటు రహదారులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతామన్నారు.
భూ సమస్యలు
పునరావృతం కారాదు
● రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి
ఆర్‌పీ సిసోడియా
ప్రశాంతి నిలయం: జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా రికార్డులు పక్కాగా రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన.. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్, రీ సర్వే, రెవెన్యూ సదస్సులతో పాటు పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ టీఎస్ చేతన్‌తో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భూముల వర్గీకరణతో కూడిన మ్యాప్‌లు తయారు చేయాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్, 22ఏ, డి.నోటిఫైడ్, భూసేకరణ, సమీకరణ, ఫ్రీహోల్డ్, డిజిటలైజేషన్, జాయింట్ ఎల్‌పీఎంల రూపకల్పనతో పాటు ఇతర రెవెన్యూ అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో విజయసారథి, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, మహేష్, ఆనంద్‌కుమార్, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయం
ప్రశాంతి నిలయం: వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. ఇందుకోసం జిల్లాలో 20 సూత్రాల అమలు కార్యక్రమం పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 20 సూత్రాల కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో చైర్మన్ లంకా దినకర్, కలెక్టర్ టీఎస్ చేతన్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాల అమలు, వివిధ ప్రాజెక్ట్‌ల పురోగతిపై సమీక్షించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి చేపట్టిన 10 అంశాలను సంబంధించిన వివరాలను కలెక్టర్ చేతన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్, లక్ పతి దీదీ, జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ తదితర ప్రాజెక్టులు జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాయలసీమ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా లేపాక్షి–పెనుకొండలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ముందే చిత్రావతి సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రహదారుల కోసం భూసేకరణ వేగవంతం
రహదారుల కోసం భూసేకరణ వేగవంతం
Comments
Please login to add a commentAdd a comment