రీ సర్వే పక్కాగా నిర్వహించాలి
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేను గురువారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో పరిశీలించారు. ఆయనతో పాటు కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ ఉన్నారు. గ్రామానికి చెందిన రైతు చిన్నపరెడ్డి పొలంలో జరుగుతున్న రీ సర్వేను పరిశీలించి రీసర్వే అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పూర్తయితే మళ్లీ ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఏడీ విజయశాంతిబాయి, డీటీ కళ్యాణ్, సర్వేయర్ లక్ష్మీ, సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాంకర్లు విరివిగా
రుణాలు అందివ్వాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: బ్యాంకర్లు జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులు, రైతులకు విరివిగా రుణాలు అందివ్వాలని కలెక్టర్ టీఎస్ చేతన్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం స్థానిక మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన 2024–25 అర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్య సాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సంప్రదింపులు కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో స్థిరమైన వృద్ధిరేటు సాధనకు కృషి చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ శిక్షణ పూర్తి చేసిన లబ్ధిదారులు జిల్లాలో 2 వేల మంది ఉన్నారని, వారికి రుణాలు అందించేందుకు జాబితా సిద్ధం చేసి లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు ఇవ్వాలన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి మంజూరైన యూనిట్లకు సంబంధించి రుణాలను గడువులోగా పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధి గంగాధర్, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమశాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఎల్‌డీఎం రమణకుమార్, మత్య్సశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, నాబార్డ్ మేనేజర్ అనురాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment