సుత్తితో కొట్టి.. నగల అపహరణ
ఓడీచెరువు: రాత్రి వేళ ఓ ఇంటి తలుపుతట్టిన దుండగులు...డోరు తీసిన మహిళ నెత్తిపై సుత్తితో కొట్టి ఆమె వంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఓడీచెరువులో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు... వైద్య,ఆరోగ్యశాఖ విశ్రాంత ఉద్యోగి లక్ష్మమ్మ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా...దుండగులు తలుపుతట్టి పేరుపెట్టి పిలిచారు. దీంతో ఆమె తలుపుతీయగానే సుత్తితో తలపై కొట్టారు. ఈ హఠాత్పరిణామంతో లక్ష్మమ్మ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో దుండగులు ఆమె మెడలోని గొలుసు, చేతికున్న బంగారు గాజులు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత లక్ష్మమ్మకు ఎప్పటికో మెలకువ రాగా, అతికష్టమ్మీద తన కూతురుకు ఫోన్ చేసి విషయం తెలిపింది. దీంతో ఆమె వచ్చి లక్ష్మమ్మను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అనంతరం స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మొత్తంగా 14 తులాల బంగారు నగలు దుండగులు అపహరించినట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment