గాండ్లపెంట: పట్టుమని రూ.10 వేలు విలువ కూడా చేయని గొర్రెను అపహరించి ఓ కుటుంబం చిక్కుల్లో పడింది. ఆద్యంతం సినీ ఫక్కీలో జరిగిన ఈ అపహరణలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాలు...
కోలారు జిల్లా నుంచి వస్తూ..
కర్ణాటకలోని కోలారు జిల్లా రాయపాడు గ్రామానికి చెందిన తిమ్మప్ప,... తన కుమారుడు రాజేష్, కుమార్తె ఆశతో కారులో సోమవారం తిమ్మమ్మ మర్రిమాను సందర్శనకు బయలుదేరారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మీదుగా తిమ్మమ్మ మర్రిమానుకు ఉన్న అడ్డదారిలో ప్రయాణిస్తున్న వారు.. మార్గ మధ్యంలో తంబళ్లపల్లి మండలం ఎద్దులోళ్లకోట గ్రామం వద్ద రోడ్డు పక్కన విడిది చేసిన గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను అపహరించి కారులో వేసుకున్నారు. విషయాన్ని గమనించిన కాపరి వెంటనే కేకలు వేయడంతో కారును ఆపకుండా ముందుకెళ్లిపోయారు.
45 కిలోమీటర్ల ఛేజింగ్..
గొర్రెల కాపరి కేకలు విన్న చుట్టుపక్కల కొందరు యువకులు వెంటనే అప్రమత్తమై ద్విచక్ర వాహనాల్లో కారును వెంబడించారు. ఈ క్రమంలోనే కారు వెళుతున్న మార్గంలో రెక్కమాను, గాండ్లపెంటలో తనకు తెలిసిన జీవాల వ్యాపారులకు బాధిత కాపరి ఫోన్ చేసి విషయం తెలపడంతో వారు ఆయా ప్రాంతాల్లో కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కారును ఆపకుండా తిమ్మప్ప ముందుకు దూసుకెళ్లాడు. దీంతో దాదాపు 45 కిలోమీటర్ల మేర ఛేజింగ్ జరిగింది.
చివరకు వ్యాపారుల నుంచి సమాచారం అందుకున్న గాండ్లపెంట పోలీసులు సైతం కారును ఆపే ప్రయత్నం చేయగా అక్కడ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ రోడ్డుకు అడ్డంగా నిలిపిన వాటర్ ట్యాంక్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం తంబళ్లపల్లి పోలీసులకు అప్పగించారు. అపహరించిన గొర్రెతో పాటు కారునూ స్వాధీనం చేశారు. నిందితులను అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంలో చొరవ చూపిన కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ కృష్ణవేణిని స్థానికులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment