అక్రమ బ్రిడ్జి నిర్మాణంపై ఆగ్రహం
చిలమత్తూరు: చిత్రావతి నదిపై అక్రమంగా బ్రిడ్జి కట్టిన రియల్టర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చిత్రావతిని చెరబట్టారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. ఉదయమే ఇరిగేషన్ ఏఈ, రెవెన్యూ అధికారులు అక్రమ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. నదిపై అక్రమంగా నిర్మించిన బ్రిడ్జిని తొలగించాలని సదరు రియల్టర్‌కు నోటీసులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించని నేపథ్యంలో ఇదే ఆఖరు నోటీసు ఇచ్చినట్టు ఇరిగేషన్ డీఈ యోగానంద వెల్లడించారు. ఈ నెల 28వ తేదీలోపు అక్రమ బ్రిడ్జి తొలగించకపోతే నేరుగా తామే రంగంలోకి దిగి తొలగిస్తామని హెచ్చరించారు. కాగా, అధికారులు చిత్రావతి బ్రిడ్జి వద్దకు రియల్టర్‌కు చెందిన భూముల గుండా వెళ్లేందుకు ప్రయత్నించగా..అతను గేట్లు తీయలేదు. దీంతో అధికారులు రెండు కిలోమీటర్ల మేర నడిచి అక్రమ వంతెన వద్దకు చేరుకోవాల్సి వచ్చింది.
సొంత అవసరాలకే...
నదికి ఇరువైపులా రియల్టర్ రెడ్డెప్పశెట్టికి చెందిన భూములున్నాయి. దీంతో అక్కడివరకూ వచ్చి వెళ్లేందుకు అతను బ్రిడ్జి నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చిత్రావతి నదీ జలాలను తన భూములకు వినియోగించుకునేందుకు గుట్టుగా వంతెన నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. నాలుగేళ్లుగా చిత్రావతి ప్రవహిస్తుండగా సదరు రియల్టర్ తన భూములకు వాటిని వినియోగించుకునేందుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారని, కేవలం ఓవర్‌ఫ్లో అయినప్పుడు మాత్రమే నీరు దిగువకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని నోటీసులు ఇచ్చారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
28లోపు చిత్రావతిపై
నిర్మించిన వంతెన తొలగించాలి
రియల్టర్‌కు నోటీసులు జారీ చేసిన
అధికారులు
అక్రమ బ్రిడ్జి నిర్మాణంపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment