పచ్చదనం పెంపొందిద్దాం
ఎన్‌పీకుంట: అడవుల్లో అగ్నిప్రమాదాలు నివారించి, పచ్చదనం పెంపొందించేందుకు అటవీశాఖ, ఎఫ్‌ఈఎస్ సంస్థ కలిసి ప్రణాళికలు రూపొందించుకొని పనిచేద్దామని జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి పిలుపునిచ్చారు. పెడబల్లి జలాశయ పరిసర ప్రాంతాలతో పాటు ఎగువతూపల్లి, పాపన్నగారిపల్లి, సారగుండ్లపల్లి, నాగంవారిపల్లిలో సోమవారం ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ సంస్థ (ఎఫ్‌ఈఎస్), అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ కార్యక్రమం నిర్వహించారు. డీఎఫ్‌ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటవీశాఖ అధికారులు, ఎఫ్‌ఈఎస్ సభ్యులు ఐదు బృందాలుగా ఏర్పడి రిజర్వ్‌ఫారెస్ట్, ఉమ్మడివనరులు, చెరువులు, చిత్తడి నేలలు, వ్యవసాయ భూములలో 45 రకాల పక్షి జాతులను గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ రకాల పక్షులు, జంతుజాతులు, వృక్షజాతులు ఒకదానికి ఒకటి పరస్పరం ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, వాటి ఆవాసాలను కాపాడాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. విచక్షణరహితంగా క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడటం, కొండలు, అడవులకు నిప్పుపెట్టడం వల్ల పక్షులు అంతరించిపోతున్నాయన్నారు. పక్షులతో పర్యావరణ సమతుల్యత సాధ్యమని, వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఈఎస్ రాష్ట్ర ప్రతినిధి భక్తర్‌వలి, అటవీశాఖ అధికారులు, ఎఫ్‌ఈఎస్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment