నాణ్యమైన పరిష్కారం చూపకపోతే చర్యలు
ప్రశాంతి నిలయం: ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే.. అర్జీ దారు మళ్లీ పీజీఆర్‌ఎస్‌కు వస్తారు. అందువల్ల ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి. ఏ సమస్యపై అయినా అర్జీ రీఓపెన్ అయితే సంబంధిత శాఖ అధికారిపై చర్యలు తీసుకుంటాం’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘పీజీఆర్‌ఎస్’ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజల నుంచి 246 అర్జీలు అందగా, కలెక్టర్ పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. ఎక్కువగా సామాజిక ిపింఛన్లు, ఇంటి పట్టాలు, భూ సమస్యలపై అర్జీలు అందాయి. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రోజూ అన్ని శాఖల అధికారులు పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన అర్జీల స్థితి గతులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్‌కుమార్, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షిలో భూఆక్రమణకు అడ్డుకట్ట వేయండి
ప్రపంచ ప్రసిద్ధి చెందిన లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయం తూర్పు ద్వారం ఎదురుగా 396 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని కొందరు అక్రమించి భవన నిర్మాణం చేపట్టారని హిందూపురానికి చెందిన నాగరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణపై లేపాక్షి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీ సమర్పించారు. స్పందించిన కలెక్టర్... వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
‘పీజీఆర్‌ఎస్’లో అందే అర్జీలు పునరావృతం కాకూడదు
అధికారులను హెచ్చరించిన కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment