మాట తప్పడం చంద్రబాబు నైజం
పరిగి: ‘‘మోసం..నమ్మక ద్రోహం..మాట తప్పడం.. చంద్రబాబు నైజం. అందుకే ఆయన ఇచ్చిన హామీలేవీ అమలు చేయరు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మండలంలోని ఊటుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు విధానాలను తప్పుబట్టారు. నిరుపేదల సంక్షేమంపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించేవారన్నారు. అలవిగాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం...ఆ తర్వాత అధికారమిచ్చిన ప్రజలను అష్టకష్టాలు పెట్టడం చంద్రబాబుకు కొత్తేమీకాదన్నారు. పింఛన్లను చూపుతూ ప్రచార ఆర్భాటం తప్ప.. కూటమి సర్కార్ 9 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే 90 శాతం హామీలు అమలు చేశారని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ సీపీ సర్కార్ నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయగా... ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం ‘‘వైఎస్సార్ సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టే’’ అని వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. నాడు జగనన్న మంచి చేశారు కాబట్టే నేడు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కాలరు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారన్నారు. జనం కూడా జగనన్న పాలనను మెచ్చుకుంటున్నారన్నారు.
అన్యాయం జరిగితే సహించం..
సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు వైఎస్సార్ సీపీ మద్దతుదారులకు అన్యాయం చేయాలని చూస్తే రోడ్డెక్కి పోరాడతామన్నారు. అర్హత ఆధారంగా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సిందేనన్నారు.
పవన్, పురంధేశ్వరి ప్రశ్నించరా..?
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించబోమంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి సర్కార్ వైఫల్యంపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. గద్దెనెక్కి 9 నెలలు గడిచినా హామీలు అమలుకు ముందుకు రాని చంద్రబాబును వారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, సర్పంచ్ దిలీప్, ఎంపీటీసీ సభ్యురాలు అమరావతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
‘సూపర్‌సిక్స్’కు బడ్జెట్‌లో
కేటాయింపులు శూన్యం
అర్హులకు సంక్షేమ పథకాలు
అందకపోతే రోడ్డెక్కుతాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment