బాలింత మృతి
● డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని
బంధువుల ఆరోపణ
హిందూపురం టౌన్: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలింత కొద్ది గంటల్లోనే మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణంటూ బంధువులు ఆరోపించారు. మృతురాలి భర్త హరి తెలిపిన వివరాల మేరకు...పట్టణంలోని సూరప్ప కట్ట ప్రాంతానికి చెందిన ప్రీతి(25) ఈ నెల 1వ తేదీన ప్రసవ నొప్పులతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ నీరజ ఆమెను పరీక్షించి సిజేరియన్ చేశారు. ప్రీతి మగశిశువుకు జన్మనివ్వగా కుటుంబీకులంతా ఆనంద పడ్డారు. అయితే సిజేరియన్ తర్వాత ప్రీతికి రక్తస్రావం ఎక్కువగా జరిగి ప్లేట్ లెట్స్ తగ్గిపోయాయి. దీంతో డాక్టర్ నీరజ అనంతపురం రెఫర్ చేశారు. ఆ సమయంలో 108 అందుబాటులో లేకపోవడంతో.. ప్రైవేటు అంబులెన్సులో ప్రీతిని బంధువులు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రీతి 2వ తేదీన మధ్యాహ్నం మృతి చెందింది. అయితే డాక్టర్ నీరజ నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని ప్రీతి భర్త హరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం హిందూపురం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై డాక్టర్ నీరజను వివరణ కోరగా.... సిజేరియన్ సమయంలో ప్రీతికి రక్తస్రావం జరిగి ప్లేట్‌లెట్లు తగ్గిపోయాయన్నారు. దీంతో స్థానికంగా ప్లేట్‌లెట్స్ అందించడానికి అవకాశం లేకపోవడంతో అనంతపురానికి రెఫర్ చేశామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని తెలిపారు. వైద్యసేవల్లో ఎలాంటి నిర్లక్ష్యమూ వహించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment