అనంతపురం సిటీ: కౌలు రైతులకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసి ఆదుకోవాలని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం చేయొద్దని ఉభయ జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ–1, 2, 3, 4, 5, 6, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/వ్యవసాయం/విద్య, వైద్య/పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ శాఖలు/ఐసీడీఎస్/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రం, గోరంట్ల, కణేకల్లు, నార్పల జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్, జయరాం, పద్మావతి, వేదాంతం నాగరత్నమ్మ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, కనీసం తాగునీరు కూడా సరఫరా చేయకపోతే ఎలాగని అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ కల్పించుకుంటూ.. వేసవికి ముందే ఎక్కడెక్కడ తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందో గుర్తించి, అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించడంలో ఎందుకు వైఫల్యం చెందారంటూ రెండు జిల్లాల ఎస్‌ఈలను నిలదీశారు. తాగునీటి పథకాల నిర్వహణకు కోట్లాది రూపాయలు జెడ్పీ నుంచి నిధులు ఇస్తున్నా వాటర్ సీనరైజ్ చార్జెస్‌ను మున్సిపాలిటీల నుంచి వసూలు చేసుకొని వాడుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో ఫిల్టర్ బెడ్స్ మార్చాలని ఆదేశించారు. దళితవాడలు, గిరిజన తండాల్లో రహదారులు, తాగునీటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు అధికారులను కోరారు. పాఠశాలలను తరచూ తనిఖీలు చేస్తే ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుందని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ అన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని గిరిజమ్మ సూచించారు. గత ప్రభుత్వం రూ. కోట్లు
ఖర్చుపెట్టి అన్ని హంగులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాల భవనాల్లో కొన్ని మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంపై అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐసీడీఎస్‌ను బ్రోకర్లు శాసిస్తారా?
శ్రీసత్యసాయి జిల్లాలో ఐసీడీఎస్ జిల్లా కార్యాలయాన్ని ఓ బ్రోకర్ శాసిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాం నాయక్ ఆరోపించారు. సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జయరాం నాయక్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోనూ కొందరు సీడీపీఓలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను గాలికొదిలేశారని జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ ఆరోపించారు. ఈ అంశంపై ఐసీడీఎస్ శ్రీసత్యసాయి జిల్లా పీడీ భారతి స్పందిస్తూ.. తాను కొత్తగా వచ్చానని, పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతపురం అర్బన్ పరిధిలోని బుడ్డప్పనగర్ అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త భాగ్యమ్మ పదేళ్లుగా విధులకు డుమ్మాకొట్టి, ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నట్లు గత సమావేశాల్లో అధికారుల దృష్టికి తెచ్చామని, ఆమైపె ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఐసీడీఎస్ పీడీ నాగమణిని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పీడీ నాగమణి స్పందిస్తూ.. ఈ రోజే తొలగింపు ఉత్తర్వులు ఆమెకు అందించామని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశం