
విద్యార్థిని చితకబాదిన వార్డెన్
ధర్మవరం: మండలంలోని నాగలూరు వద్ద ఉన్న పీసీఎంఆర్ పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థిపై కిషోర్‌ని ఆదివారం రాత్రి వార్డెన్ సందీప్ చితకబాదాడు. బాధిత విద్యార్థి తెలిపిన మేరకు... ఆదివారం రాత్రి స్టడీ ఆవర్ ముగిసిన తర్వాత డయాస్ పైకి వెళ్లాలని వార్డెన్ తెలిపాడు. దీంతో కిషోర్ డయాస్‌పైకి వెళుతుండగా ‘ఇంకా ఇక్కడే ఉన్నావా’ అంటూ వార్డెన్ ఓ పైపు తీసుకుని బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ‘నీవు ఎంపీపీ సంగాలప్ప కొడుకువురా’ అంటూ దుర్భాషలాడుతూ పదేపదే పైపుతో కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకునేలోపు వార్డెన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీపుపై, కాళ్లపై బలమైన గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలి పోయిన విద్యార్థిని తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.
8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు
గోరంట్ల: ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. గోరంట్ల మండలం కంగారెడ్డిపల్లికి చెందిన రంగారెడ్డి, హిందూపురానికి చెందిన రాజశేఖర్‌రెడ్డికి మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి రంగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిందూపురానికి చెందని రాజశేఖర్‌రరెడ్డి, కంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బయపరెడ్డి, నరేంద్రరెడ్డిపై, రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరువుల అంగడి రంగారెడ్డి, అశ్వత్థరెడ్డి, జగన్నాథరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, జనార్ధనరెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వేటకొడవళ్లు, ఓ ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు.
చీనీ చెట్లు దగ్ధం
కనగానపల్లి: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి చీనీ తోట దగ్ధమైంది. వివరాలు.. కనగానపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన రైతు మురళి తనకున్న నాలుగు ఎకరాల్లో ఐదేళ్ల క్రితం 350 చీనీ మొక్కలు నాటాడు. ప్రస్తుతం పంట కాయ దశలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం తోటకు సమీపంలోని ఎండు గడ్డికి ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. చుట్టుపక్కల రైతులు గమనించి మంటలు ఆర్పే లోపు 200 చీనీ చెట్లు, డ్రిప్ పరికరాలు, పైపులు కాలిపోయాయి. రూ.3.5 లక్షల మేర నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులు పరిశీలించి తనకు నష్టపరిహారం అందించాలని వేడుకున్నాడు.

విద్యార్థిని చితకబాదిన వార్డెన్