
వర్గకక్షలకు ఆజ్యం పోసిన అధికారులు
పుట్టపర్తి అర్బన్: టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ప్రశాంత గ్రామంలో వర్గ కక్షలకు ఆజ్యం పోశారు. ఏకపక్ష నిర్ణయాలతో ఓ వర్గానికి వత్తాసు పలకడం వివాదాస్పందమైంది. వివరాలు.. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు గ్రామంలోని చెరువులో చేపల పెంపకాన్ని చేపట్టి వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామంలో మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేసి 41 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఇందులో ఒకే కులానికి చెందిన టీడీపీ కార్యకర్తలతో పాటు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులూ ఉన్నారు. ఇటీవల చెరువులో రెండు వర్గాలకు చెందిన సభ్యులు చెరువులో చేప పిల్లలను వదిలారు. ప్రస్తుతం చేపలు పట్టడానికి అనువుగా ఉండడంతో రెండు రోజుల క్రితం పూజలు నిర్వహించి చేపల వేటను ప్రారంభించారు. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇది కాస్త వివాదానికి దారితీయడంతో మత్స్యకార సహకార సంఘం అధికారులు, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హైడ్రామాకు తెరతీసి చేపలను టీడీపీకి చెందిన 25 కుటుంబాల వారు మాత్రమే పడతారని నిర్ణయించారు. అప్పటి నుంచి తమ కళ్ల ముందే చేపలన్నింటినీ టీడీపీ సభ్యులు పట్టుకుని వెళుతుంటే మిగిలిన మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. దీనిపై బాధితులు కలెక్టర్‌కు, సహకార సంఘం అధికారికి ఫిర్యాదు చేయడానికి వెళితే.. అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి వెనుదిరిగారు. గతంలోనూ అధికారులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను ఇబ్బంది పెట్టినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.