
‘మీ మేలు మరువలేం’
కదిరి అర్బన్: తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాము జీవితాతం గుర్తు పెట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మణికాంత్, కార్యదర్శి లింగాల కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రెగ్యులరైజ్ చేసి ఏడాది గడిచిన సందర్భంగా వారు మంగళవారం ఓ ప్రకటనలో వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమకు న్యాయంగా దక్కాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీం, నోషనల్ ఇంక్రిమెంట్‌లను అందజేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
ఫారం పాండ్‌లు నిర్మించుకోండి
పెనుకొండ రూరల్: పంటల సాగుకు దోహదపడే ఫారం పాండ్ల నిర్మాణానికి రైతులు ముందుకు రావాలని జిల్లా ప్రత్యేకాధికారి హరినారాయణ పిలుపునిచ్చారు. పెనుకొండ మండలం రాంపురంలో ఉపాధీ హమీ పథకం కింద చేపట్టిన ఫారం పాండ్, మినీ గోకులాల పనులను మంగళవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. సాగుభూములును సారవంతం చేయడంలోను, ఏటా రైతులు విభిన్న పంటల సాగు చేపట్టేలా ఫారం పాండ్‌లు దోహదపడతాయన్నారు. అనంతరం రాంపురం గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, ఆర్డీఓ ఆనంద్‌కుమార్, డ్వామా పీడీ నరసయ్య, సెరికల్చర్ జేడీ పద్మావతి, తహసీల్దార్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
యువకుడిపై
టీడీపీ కార్యకర్తల దాడి
పుట్టపర్తి అర్బన్: మండలం వెంగళమ్మచెరువులో ఓ యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన మేరకు.. గతంలో గ్రామంలో టీడీపీ నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఓ పంచాయితీలో అదే గ్రామానికి చెందిన వడ్డె బాలాజీ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అనుకూలంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకుల కక్ష కట్టి మంగళవారం సాయంత్రం బాలాజీ ఇంటి తలుపులు బద్ధలుగొట్టి లోపలకు చొరబడి చితకబాదారు. కుటుంబసభ్యుల కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని టీడీపీ నాయకులకు సర్దిచెప్పి పంపారు. ఘటనలో బాలాజీకి మూగదెబ్బలు తగిలాయి. బాధితుడి సమాచారంతో పుట్టపర్తి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.

‘మీ మేలు మరువలేం’