
తాడిపత్రికి చేరుకున్న ఫయాజ్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ప్రారంభం
పుట్టపర్తి టౌన్: బుక్కపట్నంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏప్రిల్ 2 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్టార్ కృష్ణకుమారి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చేవారు వేచి ఉండే పని లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలు ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల్లోపు రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చునన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరిపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: స్థానిక దుర్గానగర్‌లోని నెం.1 ఏటీఎం వద్ద ముగ్గురిపై దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. దుర్గానగర్‌లో ఉన్న షో ఆఫ్ ఫ్యాషన్ షాపులో శనివారం సాయంత్రం దుస్తుల కొనుగోలు విషయంగా ఇషాక్, హరీష్ వాదించుకున్నారు. దీంతో హరీష్ స్నేహితులు కాటమయ్య, రాజేష్, రాజాను పిలిపించడంతో వారు ఇషాక్‌కు సర్దిచెప్పి పంపించారు. రాత్రి 9గంటల సమయంలో దుర్గానగర్ ఏటీఎం సమీపంలో కాటమయ్య, రాజా, రాజేష్ ఉండగా ఇషాక్, అతని అన్న అబ్దుల్ రెహమాన్, మరో ఇద్దరు కలసి కట్టెలతో దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు ఆదివారం ఉదయం ఇషాక్, అతని అన్న అబ్దుల్‌రెహమాన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాడిపత్రి టౌన్: భారీ పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రి వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్‌బాషా తన ఇంటికి ఆదివారం చేరుకున్నారు. ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకట్రామిరెడ్డి.. అనంతపురంలో ఎస్పీ జగదీష్‌ను కలసి సమస్యను వివరించిన విషయం తెలిసిందే. దీంతో తాడిపత్రికి వెళ్లేందుకు ఫయాజ్‌బాషాకు ఎస్పీ అనుమతించారు. ఈ నెల 23న తన నూతన గృహంలో ఇఫ్తార్ విందును ఫయాజ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది గిట్టని జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో ఫయాజ్ ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడి చేసింది టీడీపీ వారైతే... పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు 17 మందిపై కేసులు బనాయించారు. అనంతరం ఈ నెల 26న అర్ధరాత్రి ఫయాజ్‌బాషాను గుట్టుచప్పుడు కాకుండా అనంతపురానికి తరలించారు. రంజాన్ వేళ కుటుంబసభ్యులతో కలసి పండగ జరుపుకోవాలనే ఆయన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరిస్తూ వచ్చారు. ఆంక్షలు విధిస్తూ 4 రోజుల పాటు కుటుంబసభ్యులకు దూరం చేశారు. దీంతో ఈ నెల 29న అంజాద్‌బాషా, అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్, కర్నూల్ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసుల్ అజామ్ తదితరులు ఎస్పీ జగదీష్‌ను కలసి తాడిపత్రిలో జేసీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసారు. ఫయాజ్‌బాషాను తాడిపత్రికి వెళ్లకుండా అంక్షలు విధించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు. దీంతో స్పందించిన ఎస్పీ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు మధ్య ఆదివారం సాయంత్రం తాడిపత్రిలోని తన ఇంటికి ఫయాజ్‌బాషా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ రోహిత్‌కుమార్, సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులు తాడిపత్రిలోని పలు కూడళ్లు, ఫయాజ్ ఇంటి వద్ద బందోబస్తు చేపట్టారు.
పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు