
కరువు జిల్లా పరిస్థితి ఏమిటి?
● సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య
లేపాక్షి: తాము అధికారంలోకి వస్తే హంద్రీ–నీవా కాలువకు పిల్ల కాలువలు ఏర్పాటు చేసి కరువు పీడిత శ్రీసత్యసాయి జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని గత ఎన్నికల సమయంలో హామీనిచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టిన తర్వాత ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీటిని తరలించుకెళ్లే చర్యలు వేగవంతం చేశారంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య మండిపడ్డారు. గురువారం సాయంత్రం లేపాక్షిలోని ఏపీ టూరిజం అతిథి గృహంలో సీపీఐ మండల కార్యదర్శి శివప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఆయన, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీ–నీవా నీటిని పంటల సాగుకు వదలక పోగా లైనింగ్ పనులు, సిమెంట్ ర్యాంపుల ఏర్పాటు పేరుతో రూ.3 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధికి సీపీఐ అడ్డంకి కాదన్నారు. జిల్లాలో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఎప్పడిస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షలతో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని భరోసానిచ్చిందని, అయితే పేదలకు నిర్మించే ఇంటికి నాణ్యమైన ఇసుక, ఇనుము వాడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 80 శాతం నిర్మాణాలైన ఇళ్లను కూడా పూర్తి చేయాలన్నారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మాటలు నమ్మి టిడ్కో ఇళ్ల కోసం అప్పు చేసి రూ.25 వేల నుంచి రూ.50 వేలు చెల్లించిన లబ్ధిదారులకు ప్రస్తుతం బ్యాంకర్లు అప్పులు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. టిడ్కో గృహ లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్‌కుమార్, సహాయ కార్యదర్శి గౌతమ్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
హిందూపురం టౌన్: మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ గురువారం రాత్రి మృతుడి బంధువులు ధర్నా చేపట్టారు. వివరాలు... పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా నదిలో ఇసుక తోడుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక దిబ్బ మీదపడి హేమంత్‌కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. సాయంత్రం అయినా పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో మృతుడి బంధువులు వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఇందిరమ్మ సర్కిల్‌లో రాత్రి ధర్నా చేపట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీధర్ అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. చివరకు న్యాయం చేస్తామని సీఐ రాజగోపాల్‌నాయుడు భరోసానివ్వడంతో ధర్నాను విరమించారు.
పిడుగుపాటుకు వివాహిత మృతి
గుంతకల్లు రూరల్: పిడుగుపాటుకు ఓ వివాహిత మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం కదిరిపల్లికి చెందిన సుంకన్న, రమాదేవి దంపతుల కుమారుడు రమణకు రెండేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలానికి చెందిన ఇంద్రజ (24)తో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో బోరు బావి కింద సాగు చేసిన వేరుశనగ పంట చేతికి వచ్చింది. శుక్రవారం పంటను తొలగించాలనుకున్న దంపతులు గురువారం సాయంత్రం పొలానికి వెళ్లి స్ప్రింక్లర్ల సాయంతో నీళ్లు పెడుతుండగా జడి వాన మొదలైంది. కాసేపటికి ఉరుములు, మెరుపులు ఎక్కువ కావడంతో పని ఆపి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రమణ బోరు బావి వద్దకెళ్లి కాలికి అంటుకున్న బురదను కడుక్కుంటుండగా, నాలుగు అడుగుల దూరంలోనే వేచి ఉన్న ఇంద్రజపై పిడుగు రాలింది. ఆమె శరీరంలో నుంచి నేరుగా దూసుకెళ్లడంతో గుండె కింద భాగంలో బొక్క పడి శరీరంలో రెండు చీలికలు ఏర్పడ్డాయి. కాలి పట్టీలు తెగిపడ్డాయి. శరీరం మొత్తం నల్లగా మాడిపోయింది. విషయాన్ని గమనించిన భర్త ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. దాదాపు అరగంట తర్వాత తేరుకున్న ఆయన వెళ్లి విగతజీవిగా ఉన్న పడి ఉన్న భార్యను చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఇంద్రజ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

కరువు జిల్లా పరిస్థితి ఏమిటి?

కరువు జిల్లా పరిస్థితి ఏమిటి?