కార్చిచ్చు.. కన్నీరు మిగుల్చు! | - | Sakshi
Sakshi News home page

కార్చిచ్చు.. కన్నీరు మిగుల్చు!

Published Fri, Apr 4 2025 1:43 AM | Last Updated on Fri, Apr 4 2025 1:44 AM

కార్చ

కార్చిచ్చు.. కన్నీరు మిగుల్చు!

● పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన నాగరాజు ఇటీవల తన 35 గొర్రెలను అడవికి మేతకు తీసుకెళ్లారు. ఆకతాయిలు పెట్టిన నిప్పుతో గొర్రెల మంద ఉన్న ప్రాంతం చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టమ్మీద నాగరాజు 15 గొర్రెలను రక్షించుకోగలిగాడు. మిగిలిన 20 గొర్రెలు కళ్లముందే సజీవదహనమై రూ.2.5 లక్షలు నష్టం వాటిల్లింది. కుటుంబ పోషణ కోసం నాగరాజు ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నాడు.

● సీకేపల్లి మండలం పులేటిపల్లిలో రగిలిన కార్చిచ్చు రైతు దాసరి పెద్దన్న వ్యవసాయ పరికరాలను దగ్ధం చేసింది. రూ.50 వేల నష్టం జరిగింది.

● పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద కొండకు పాకిన కార్చిచ్చుకు సుమారు 200 ఎకరాల బీడు భూముల్లో గడ్డి కాలి పోయి అడవి జంతువులకు ఆశ్రయం లేకుండాపోయింది. రైతు జనార్దన్‌రెడ్డికి చెందిన 10 పీవీసీ పైపులు, గేట్‌ వాల్వులు, డ్రిప్పు పైపులు, పరికరాలు కాలి పోయి నష్టం మిగిల్చింది.

● కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామానికి చెందిన బ్రహ్మానందరెడ్డి మామిడి పంట పూర్తి కాగానే వ్యవసాయ పరికరాలన్నింటినీ ఒక చెట్టుకింద భద్రపరిచారు. గత నెలలో ఆకతాయిలు పెట్టిన నిప్పుతో కార్చిచ్చు రగిలి మామిడి మొక్కలతో పాటు వ్యవసాయ పరికరాలు కాలిపోయాయి. దీంతో రైతుకు సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ, ఏపీఎంఐపీ అధికారులకు సమాచారం ఇచ్చినా.. పైసా నష్ట పరిహారం అందించలేదు. పైగా సబ్సిడీపై పరికరాలు మరోసారి అందించడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెబుతున్నారు.

... ఇలా చాలా గ్రామాల్లో వరిగడ్డి, వేరుశనగ కట్టె, కంది కట్టె కుప్పలు కాలిపోతుండగా.. రైతులకు రూ.లక్షల నష్టం వాటిల్లుతోంది.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

పుట్టపర్తి అర్బన్‌: ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీల మార్క్‌ దాటడంతో జనమే అల్లాడిపోతున్నారు. ఇక పొలాల్లో పచ్చని గరిక కూడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఎండిన గడ్డి, మొక్కలు, పంటలు, ఆకులురాలిపోయి మోడుగా మారిన చెట్లే కనిపిస్తున్నాయి. దీంతో చిన్న నిప్పు ఎగసిపడినా కార్చిచ్చు రగులుతోంది. పంటలను, పశుపక్ష్యాదులను దహిస్తోంది. దీంతో రైతులకు రూ.లక్షల నష్టం వాటిల్లితుండగా కన్నీరుమున్నీరవుతున్నారు. పైగా ఆదుకోవాల్సిన పాలకులు చోద్యం చూస్తుండగా...రైతుల ఆశలన్నీ కాలి బూడిదవుతున్నాయి.

అవగాహన లోపంతో గడ్డికి నిప్పు..

ఏటా మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో కొండగుట్టలు, బీడు భూముల్లో ఉన్న గడ్డి ఎండిపోయి జీవాలకు మేత కరువవుతుంది. ఈ సమయంలో కొందరు గడ్డికి నిప్పు పెడతారు. తొలకరి వర్షాలకు కాలిన చోట గడ్డి మొలకెత్తి త్వరగా జీవాలకు మేత దొరుకుతుందని ఇలా చేస్తుంటారు. కానీ ఇలా అవగాహన లోపంతో కొందరు నిప్పు పెడుతుండగా..కార్చిచ్చు రగిలి సమీపంలోని పొలాల తగలబడిపోతున్నాయి. మూగజీవాలూ సజీవ దహనమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యాన తోటల్లో ఎంతో కాలంగా పెంచుకుంటున్న పండ్ల మొక్కలతో పాటు వాటికి ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాలు కాలి బూడదవుతున్నాయి. దీంతో రైతులు, పశువుల కాపర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా రెండు నెలల కాలంలోనే జిలాల్లో పదుల సంఖ్యలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రైతులకు సరైన అవగాహన లేక పోవడం, అందుబాటులో నీళ్లు లేకపోవడంతో కార్చిచ్చు వందలాది ఎకరాల్లో గడ్డితో పాటు చుట్టూ ఉన్న అన్నింటినీ కాల్చి వేస్తుంది. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినా... సకాలంలో పొలాల్లోకి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక వేళ అగ్నిమాపక సిబ్బంది వచ్చినా...గడ్డే కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.

భానుడి భగభగలతో

పెరిగిన ఉష్ణోగ్రతలు

ఎటుచూసినా ఎండిపోయిన పొలాలు

ఆకతాయి చేష్టలతో

రగులుతున్న కార్చిచ్చు

పంటలు, వ్యవసాయ

పరికరాలూ దగ్ధం

మూగజీవాలు, పాడిపశువుల

సజీవ దహనం

నష్టపోతున్న రైతన్నలు..

ఆదుకోవాలంటూ వేడుకోలు

కార్చిచ్చు.. కన్నీరు మిగుల్చు! 1
1/1

కార్చిచ్చు.. కన్నీరు మిగుల్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement