
మారణహోమాన్ని ఆపేందుకే జగనన్న రాక
రాప్తాడురూరల్: ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ సభలో పాల్గొనేందుకు రావడం లేదు. చీమకు కూడా హాని తలపెట్టని పేద రైతు కురుబ లింగమయ్యను హత్య చేస్తే ఆ కుటుంబానికి అండగా నిలవడానికి, జిల్లాలో మారణ హోమాన్ని ఆపడానికి, మరో రాజకీయ హత్య జరగకూడదనే సందేశం ఇవ్వడానికి వస్తున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాపిరెడ్డిపల్లికి వస్తున్న నేపథ్యంలో సోమవారం తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి కుంటిమద్ది మీదుగా పాపిరెడ్డిపల్లి చేరుకుంటారన్నారు. ఇటీవల హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడతారని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని వెల్లడించారు.
ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొడదాం
జిల్లాలో ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టాలనుకునే విజ్ఞులు, భవిష్యత్తు బాగుండాలని కోరుకునే యువత, రాప్తాడు నియోజకవర్గ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మేల్కోవాలని ప్రకాష్ రెడ్డి కోరారు. కుట్ర, హత్యా రాజకీయాలు కలగలిసి ప్రభుత్వ మద్దతుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘నడుచుకుంటూ వస్తారో... సైకిల్, బైకు, ట్రాక్టర్, ఆటోల్లో వస్తారో మీ ఇష్టం. మీరు రావాలి. వస్తేనే జిల్లా నుంచి ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టగలం అనే విషయం గుర్తుంచుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో శాంతి కుసుమాలు
మనందరం అభివృద్ధిని కాంక్షిస్తున్నామని, గత ఐదేళ్లూ జగనన్న సంక్షేమాన్ని చూశామని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న హయాంలో శాంతి కుసుమాలు ఎలా వికసించాయో అందరూ చూశారన్నారు. ఒక గొడవ కాని, హత్యకాని జరగకుండా ఐదేళ్లు పరిపాలన సాగించారన్నారు. ‘కూటమి’ అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి మారణకాండను ఆపుదామా.. ఆపుదామంటే అందరూ వచ్చి జగనన్నకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ‘ఎవరో కాకమ్మ కథలు చెబుతుంటారు, కుట్రలతో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని, ‘పచ్చ’ మీడియాను ఉపయోగించుకుని జగన్‌మోహన్‌రెడ్డిపైనా, నాపైనా దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ఇక్కడ బతకాల్సింది నువ్వు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుకోవాల్సింది నువ్వు. అది నీ బాధ్యత. ఆ బాధ్యతను నిలబెట్టుకోవడానికి మంగళవారం ఉదయం 9 గంటలకు కుంటిమద్ది గ్రామానికి రావాలి’ అని ఆయన పేర్కొన్నారు. శాంతిస్థాపనకు జగనన్నతో కలిసి కవాతు చేద్దామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, దుర్మార్గాలను జిల్లా ఓర్చదనే సందేశం ఇద్దామని, జిల్లాను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.
చీమకు కూడా హాని తలపెట్టని కురుబ లింగమయ్యను హత్య చేశారు
శాంతిస్థాపనకు జగనన్నతో
కలిసి కవాతు చేద్దాం
ప్రజలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు