
‘వెటర్నరీ’ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఎ
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ అధికారుల సంఘం (వెటర్నరీ ఆఫీసర్స్ అసోసియేషన్) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డిపల్లి శిక్షణా కేంద్రం ఏడీ డాక్టర్ వి.రామచంద్రారెడ్డిని ఎన్నుకోగా, కార్యదర్శిగా డాక్టర్ పి.మల్లేష్‌గౌడ్ (కొత్తచెరువు వీహెచ్, ఏడీ), కోశాధికారిగా డాక్టర్ జీఎస్ అమర్ (మడకశిర వీహెచ్, ఏడీ), ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ ప్రసన్నబాయి (తలుపుల వీహెచ్, ఏడీ), జాయింట్ సెక్రటరీగా డాక్టర్ ఖదీర్‌బాషా (తాడిపత్రి వీహెచ్, ఏడీ) ఎన్నికయ్యారు. ఎన్నికై న నూతన కార్యవర్గ సభ్యులు రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గ సభ్యులను, అసోసియేషన్ సభ్యులను ఆ శాఖ అధికారులు అభినందించారు.
వృద్ధుడి అనుమానాస్పద మృతి
గుడిబండ: మండలంలోని నాచేపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప(60) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక తిరిగే వాడు. భార్య భాగ్యమ్మ, కుమారులు, కుమార్తె బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి తన ఇంటి వద్ద బొక్కబోర్లా పడి కనిపించడంతో గమనించిన గ్రామస్తులు పైకి లేపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గోవిందప్ప భార్య భాగ్యమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దుర్మరణం
బుక్కరాయసముద్రం: మండలంలోని రేకులకుంట సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బీకేఎస్ మండలం దయ్యాలకుంటపల్లికి చెందిన చాకలి శివానంద (28) గ్రామంలో రజక వృత్తితో కుటుంబానికి చేదోడుగా నిలాచాడు. భార్య ప్రసన్నలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తిగత పనిపై ఆదివారం అనంతపురానికి వెళ్లిన ఆయన.. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. రేకులకుంట సమీపంలోకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో శివానంద కాలు విరిగి 15 అడుగుల దూరంలో పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనం ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

‘వెటర్నరీ’ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఎ