కొద్దిసేపటి క్రితం వరకు తన చిన్నారి తనయ చేసిన చిలిపి చేష్టలు చూసి ఆ తల్లి మురిసిపోయింది. అలసిన చిట్టి తల్లిని నిద్ర పుచ్చి తన పనిలో పడింది. కానీ అంతలోనే జరగరాని దారుణం జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదు. చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లాయని తెలిసి ఆందోళనతో పరుగులు తీసింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆ ఇంటి దీపం మలిగిపోయింది. వీధి కుక్కల దాడిలో చిన్నారి సాద్విక బలై పోయింది. ఆ కుటుంబమే కాదు.. ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.
జి.సిగడాం/రాజాం సిటీ: మెట్టవలస గ్రామానికి చెందిన పైల రాంబాబు, రామలక్ష్మీ దంపతుల రెండో కుమార్తె సాద్విక (1) కుక్కల దాడిలో శుక్రవారం మృతి చెందింది. రాంబాబు దంపతులు రాజాం, పొందూరు ప్రధాన రహదారిలో సీతామహలక్ష్మి జ్యూట్ మిల్లు ఎదురుగా చిన్న టీ దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాద్విక ఆటలాడుకుని అప్పుడే మంచంపై నిద్రపోయింది. ఈ లోగా ఊరకుక్కలు ఒకేసారి వచ్చి చిన్నారిపై దాడి చేశాయి. పాప గొంతును నోట కరిచి పక్కనే ఉన్న టేకు తోటలోకి ఈడ్చుకెళ్లాయి.
చిన్నారి గట్టిగా అరవడంతో ఆమె సోదరి కుసుమ కుక్కలను చూసి తల్లికి విషయం చెప్పింది. తల్లి వెంటనే తోటకు వెళ్లి చూడగా.. కుక్కలు పసిపాపపై దాడిచేయడం కనిపించింది. వెంటనే ఆమె కేకలు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న వారు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని హుటాహుటిన రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించడానికి సిద్ధమవుతుండగా.. చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ముద్దుగారే పసిపాప మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల గుండెలవిసేలా రోదించారు. పాప తల్లిదండ్రులు వలస వెళ్లి బతికేవారు. పిల్లలు పుట్టడంతో ఏడాదిన్నర నుంచి గ్రామంలోనే కూలి, నాలి చేసి జీవిస్తున్నారు. ఈ లోగా జ్యూట్ మిల్లు ఎదురుగా చిన్న టీ దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. చిన్నారి ఇలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
శ్రమించినా ఫలితం దక్కలేదు
కుక్కల దాడిలో తీవ్ర గాయాలైన సాద్విక ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంతో శ్రమించాం. అయినా ఫలితం దక్కలేదు. పాప గొంతును కుక్కలు కొరికేయడంతో పరిస్థితి విషమించింది. అప్పటికీ డాక్టర్లంతా కష్టపడ్డారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించేందుకు సిద్ధం చేశాం. కానీ పాప ప్రాణాలు కాపాడలేకపోయాం.
– ముంజేటీ కోటేశ్వరరావు, వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment