గ్రామ సచివాలయ సర్వేయర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ సచివాలయం సర్వేయర్లపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తు గ్రామ సచివాలయం సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేయర్లపై పనిభారం, ఒత్తిడి, వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ (ఎస్‌ఓపీ) ప్రకారం పనిచేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, వీఆర్వోల పని కూడా తమతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 28 మండలాల్లో రీ సర్వే జరుగుతోందని, ఆ పనులు పూర్తి కాకముందే మండలానికి రెండు గ్రామాలు వంతునా అదనంగా మరో 56 గ్రామాలు రీ–సర్వే చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. కొత్త పరికరాలు ఇవ్వకపోవడంతో సర్వే చేయడం కష్టంగా మారిందన్నారు. గతంలో క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు బయోమెట్రిక్ హాజరు వెసులుబాటు ఉండేదని, కొత్త ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా కార్యాలయంలోనే హాజరువేయాలని నిబంధనలు విధించడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు ఈ నెల 9న విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి లోకేష్, రాష్ట్ర కో–ఆర్డినేటర్ మజ్జి అయ్యప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment