ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో చూసిరాతలు జరగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. 1, 3, 5, 7, 9 సెమిస్టర్లకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ న్యాయ కళాశాలకు చెందిన 250 మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించడం వల్ల గూగుల్, వాట్సాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆస్క్ మేటా ఏ–1ల ద్వారా చూసిరాతలు జరగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెక్టార్, చీఫ్ సూపరింటెండెంట్ అడ్డయ్య వద్ద ప్రస్తావించగా పూర్తిస్థాయి నిఘా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పరీక్ష కేంద్రం పరిశీలన
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల సెమిస్టర్ పరీక్షలను గురువారం రెక్టార్ అడ్డయ్య, పరీక్షల నిర్వహణ డీన్ ఉదయ్‌భాస్కర్, ప్రత్యేకాధికారి సామ్రాజ్యలక్ష్మి పరీక్షలు పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిలేటర్లకు సూచించారు.


