శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం(2025–26) ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అనంతరం లెక్కింపు చేపట్టారు. 604 మందికి గాను 529 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ చేయగా తంగి శివప్రసాద్ 272 ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఇప్పిలి సీతరాజు, ప్రధాన కార్యదర్శిగా పిట్టా దామోదరరావు, మహిళా ప్రతినిధిగా గురుగుబెల్లి వనజాక్షి విజయం సాధించారు. ఇప్పటికే కార్యదర్శిగా మాటూరి భవానీప్రసాద్, కోశాధికారిగా కొమర శంకరరావు, గ్రంథాలయ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికై న సంగతి తెలిసిందే. సీనియర్ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, ఎన్.విజయ్‌కుమార్‌లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు అగూరు ఉమామహేశ్వరరావు, మామిడి క్రాంతి, బి.వి.రమణ తదితరులు అభినందించారు.


