● అందరికీ మంచి జరగాలి: కలెక్టర్
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకాంక్షించారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ ఉగాది పచ్చడిలోని అన్ని రుచులు ఉన్నట్లే మంచి, చెడులు ఉంటాయని వాటన్నింటిని గెలుచుకొని ముందుకు సాగాలని కోరారు. ముందుగా ధర్మపురి గౌరీశంకరశాస్త్రి పంచాంగ పఠనం చేశారు.
అర్చకులకు సత్కారాలు
దేవాదాయశాఖ ఎంపిక చేసిన ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా గుడివీధిలోని ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తిని, కవిటి మండలం బెజ్జిపుట్టుగ శ్రీచక్రపెరుమాళ్లు అర్చకులు బాలక సత్యనారాయణ, కంచిలి మండలం కొల్లూరు శ్రీజగన్నాథ స్వామి ఆలయ అర్చకులు పద్మనాభ పాడిలను సత్కరించి వారికి నగదు పారితోషికాలను అందించారు. అలాగే పంచాంగకర్త గౌరీశంకరశాస్త్రిని కూడా సత్కరించారు.
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
ఈ సందర్భంగా గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కవులు కె.వి.రాజారావు, బొంతు సూర్యనారాయణ, పొట్నూరు సుబ్రహ్మణ్యం, ఈ వేమన, ఉపకలెక్టర్ సవరమ్మ, శ్రీనివాసరావు, ఆరవెల్లి అనంతరామం, దామోదరాచారి, రమణమూర్తి, నాగేశ్వరరావు, భోగిల ఉమామహేశ్వరరావు, పూడి జనార్దనరావులు కవి సమ్మేళనంలో పాల్గొని ఉగాది కవితలను వినిపించారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఉపకలెక్టర్ లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు.
● అందరికీ మంచి జరగాలి: కలెక్టర్


