పలాస: మండలంలోని చిన్నగురుదాసుపురంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం సమీపంలోని సింగుపురం జట్టు విజేతగా నిలిచింది. చినగురుదాసుపురం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 21 జట్లు పాల్గొన్నాయి. లింబుగాం జట్టు ద్వితీయ, గొల్లమాకన్నపల్లి తృతీయ స్థానాలు సాధించాయి. శ్రీకాకుళం కె.ఆర్.స్టేడియం జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పాలిన కృష్ణారావు, కార్యదర్శి జినగ తాతారావు, సాలిన రమేష్, జినగ ధర్మారావు, కొండే తేజేశ్వరరావు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం: జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌గా బి.శ్రీరామమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని రాష్ట్ర ఫ్యాప్టో పరిశీలకులు(యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) ఎస్.కిషోర్ తెలిపారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఫ్యాప్టో వైస్ చైర్మన్లుగా పి.హరిప్రసన్న, వి.సత్యనారాయణ, సెక్రటరీ జనరల్‌గా పి.ప్రతాప్‌కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎస్.వి.రమణమూర్తి, ఎం.మదన్‌మోహన్‌రావు, బి.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కె.జగన్‌మోహన్‌రావు, కార్యవర్గ సభ్యులుగా బాబూరావు, ఎస్.రమేష్‌బాబు, పి.కృష్ణారావు, వై.వాసుదేవరావు, జి.రమణ, ఎస్.వి.అనిల్‌కుమార్, బి.రవి, ఎస్.ఎస్.ఎల్.వి.పూర్ణిమలను ఎన్నుకున్నట్లు తెలిపారు.
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ–2003 ఏపీ ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఫోరం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆలస్యం వల్లే డీఎస్సీ – 2003 నియామకాలు 2005 నవంబరులో చేపట్టారని చెప్పారు. దీంతో పాత పెన్షన్ విధానం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 మేరకు అర్హత వ్యక్తులందరికీ పాతపెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. తూర్పుగోదావరికి చెందిన రూపరాజు మాట్లాడుతూ కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జిల్లా కో–కన్వీనర్లు కె.ప్రకాష్, పి.శ్రీకర్, వి.శ్రీను, ఎ.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు న్యాయం చేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో చూచిరాతలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం అవసరమేనని.. అయితే డీఈఓ తిరుమల చైతన్య ఎంచుకున్న మార్గం సరైనదికాదని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ అన్నారు. కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రంలో అన్యాయంగా డీబారైన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి క్రాంతిభవన్ వేదికగా సోమవారం ఎస్టీయూ జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పిలి కేంద్రంపై కాపీయింగ్ ఆరోపణలు ఉన్నప్పుడు పరీక్ష కేంద్రంగా ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు. పరీక్ష కేంద్రం నిర్వహణకు పకడ్బందీ చర్యలు ఎందుకు చేపట్టలేదో డీఈఓ తెలియజేయాలని, హోల్డ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, కోర్టు కేసులను రద్దు చేయాలని కోరారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ డీఈఓను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 400 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రంలో విద్యార్థులను భయాందోళనలకు గురిచేసి, పిల్లల విలువైన కాలాన్ని వృథా చేసిన డీఈఓపై కచ్చితంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శి గురుగుబెల్లి రమణ, ప్రతినిధులు పి.రామకృష్ణ, ఎస్.రాధాకృష్ణ, కె.శ్రీనివాసరావు, లక్ష్మణరావు, పి.రమణ, డీవీఎన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీల విజేత సింగుపురం
కబడ్డీ పోటీల విజేత సింగుపురం
కబడ్డీ పోటీల విజేత సింగుపురం


