రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ
శ్రీకాకుళం అర్బన్: కూటమి నాయకులు జిల్లాలో ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌తో సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతినాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని రాష్ట్ర సివిల్ రైట్స్ ఫోరం కార్యాలయంలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాపాలన, సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. నదులను యంత్రాలతో తవ్వుకుంటూ పోతే రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడడం ఖాయమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరారు. ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు తక్షణమే అమలు చేసి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర సివిల్ రైట్స్ కార్యదర్శి కె.కోటయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.శేఖర్‌బాబు పాల్గొన్నారు.


