ఆర్జేడీతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో కుప్పిలి మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్షల కాపీయింగ్ రగడలో మిగిలిన నలుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి మరో మూడు నాలుగు రోజులు సమ యం కావాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులను కోరారు. 3 నుంచి జరగనున్న టెన్త్‌క్లాస్ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం జిల్లాకు వచ్చిన ఆర్జేడీ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి తిరుమల చైతన్యను విధుల నుంచి తక్షణమే తప్పించాలని, మిగిలిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్లు ఎత్తివేయాలని, ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని సంఘాల ప్రతినిధులు కోరారు. వీటిపై మూడు నాలుగు రోజులు గడువు కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, దుప్పల శివరామ్‌ప్రసాద్, ఎంవీ రమణ, శ్రీరామ్మూర్తి, వెంకటేశ్వరరావు, వసంతరావు, కిషోర్‌కుమార్ తదితరులు పేర్కొన్నారు. అనంతరం డీఈఓ కార్యాలయం ఎదుట అధికారుల వైఖరిని నిరసిస్తూ నిరసన చేపట్టారు. అంతకుముందు అదనపు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఉపాధ్యాయులపై నమోదైన క్రిమినల్ కేసుల విషయమై తమకు స్పష్టతకావాలని ఉపాధ్యాయులు కోరగా.. ఎస్సైతో నేరుగా అదనపు ఎస్పీ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


