అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే కష్టం
● జాబ్‌మేళాలో మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి: అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కష్టమని.. ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో ఉపాధి కలిగించేలా నైపుణ్యత శిక్షణ అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. మంగళవారం కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమక్షంలో నిర్వహించిన జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 32 కంపెనీల ద్వారా 1200 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో తెలియడానికి ఆన్‌లైన్ చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 9 నెలల పాలనలో 7 లక్షల పెట్టుబడులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ విభాగానికి అధిక శాతం ఉద్యోగాలకు దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ వేతనాలు, ప్రదేశాలతో సంబంధం లేకుండా ముందుగా ఉద్యోగాల్లో చేరాలన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి యు.సాయికుమార్, జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, సెట్‌శ్రీ సీఈఓ ప్రసాదరావు, నెహ్రూ యువకేంద్రం డీడీ ఉజ్వల, ఉపాధి కల్పన అధికారి వంశీ, నాయకులు కె.హరివరప్రసాద్, బి.రమేష్, బి.రమణమ్మ, టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


