శ్రీకాకుళం పాతబస్టాండ్: డీఎస్సీ రాయనున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నామని, ఈ శిక్షణ కు గాను ఈనెల 10వతేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమాధికారి ఇ.అనురాధ తెలిపారు. మెగా డీఎస్సీ టెట్ పరీక్షలో అర్హత సాధించిన శ్రీకాకుళం జిల్లా వాసులైన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కేటగిరీలకు చెందిన వారు ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. టెట్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని, టెట్ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో శ్రీకాకుళంలోని 80 అడుగులు రోడ్డులో గల ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం ఫోన్ నంబర్లు 7382975679, 9295653489ను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు పది, ఇంటర్మీడియెట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జాబితా, రెండు ఫొటోలు అందజేయాలని తెలిపారు.
రిమ్స్‌లో ప్రత్యేక ఓపీ క్లినిక్‌లు
శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకు ప్రత్యేక ఓపీ క్లినిక్‌లను కొన్ని రోజుల పాటు నిర్వహించనున్నామని రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక క్లినిక్‌లో సంబంధిత వ్యాధి లక్షణాలు గల వ్యక్తులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. ఈ క్లినిక్‌లో పా ల్గొనే వారంతా వ్యాధికి సంబంధించిన పాత రికార్డులు, వారి ఆధార్ కార్డుతో పాటు సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈనెల 7వ తేదీన మూర్ఛ వ్యాధి, 10వ తేదీన రొమ్ము వ్యాధులు, 11వ తేదీన థైరాయిడ్ సమస్యలు, 15వ తేదీన హె ర్నియా, కడుపులో వాపులు, బీర్జాలు, 16వ తేదీన పచ్చ కామెర్లు, కాలేయం తదితర సంబంధిత సమస్యలు, 23వ తేదీన పాదాల వ్యాధులు, మధుమేహంకు సంబంధించిన పాదాల సమస్యలున్న వారంతా హాజరుకావచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ప్రత్యేక ఓపీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇంటిలో గ్యాస్ లీక్
హిరమండలం: హిరమండలంలోని చిన్నకోరాడ వీధిలో పెను ప్రమాదం తప్పింది. వీధిలో ని దేవరశెట్టి శ్రీనివాసరావు భార్య శ్రీదేవి శుక్రవారం ఇంటిలో వంటచేయడానికి గ్యాస్‌స్టవ్‌ను వెలిగించగా.. ట్యూబ్ ద్వారా గ్యాస్ లీకై సిలిండర్‌లో మంటలు చేలరేగాయి. దీంతో ఆమె భయంతో ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే చిన్నకోరాడ సెంటర్‌లో హోటల్ నిర్వహిస్తున్న భర్తకు విషయం చెప్పారు. అప్పటికే ఇంటి నిండా పొగలు కమ్ముకున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి, కొత్తూరు అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. గ్యాస్ కార్యాలయం నుంచి వచ్చిన కృష్ణంరాజు సిలిండర్ నుంచి వచ్చిన మంటలను పూర్తిగా అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి మంటలు అదుపులోకి వచ్చాశాయి.


